పాక్ సైన్యం, తాలిబన్ల మధ్య భీకర కాల్పులు

డ్యూరండ్ రేఖ వెంబడి పాక్ సైన్యం, తాలిబన్ల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. శుక్రవారం దాదాపు అరగంటపాటు కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.
సరిహద్దు వద్ద ఉన్న ఫెన్సింగ్‌ను తాలిబన్‌ సైన్యానికి చెందిన వ్యక్తి తొలగిస్తున్న సమయంలో ఇద్దరు పాక్ సైనికులు అడ్డుకున్నారు.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ వ్యక్తి వారిని కాల్చి చంపడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 

ఆ తర్వాత కొన్ని గంటలకే ఆఫ్ఘనిస్థాన్, పాక్ వైపు నుంచి ప్రకటన వెలువడింది. ఉద్రిక్తతలు మణిగినట్టు పేర్కొన్నాయి. అయితే, కాల్పులు కారణంగా సంభవించిన నష్టం గురించి మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ మధ్య కొన్నేళ్లుగా సరిహద్దు వివాదం ఉంది. ఆఫ్ఘన్ సరిహద్దు వద్ద 26 వేల కిలోమీటర్ల మేర కంచె పనుల్ని పూర్తి చేయగా, తాలిబన్లు ఆ ఫెన్సింగును కత్తిరించి స్క్రాప్‌లో అమ్మేసుకుంటున్నట్టు పాక్ ఆరోపిస్తోంది. 

కాగా, రెండు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం పరిష్కారమైందని ఇరు దేశాలు ఇటీవల ప్రకటించాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ  కాల్పులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.