మగాళ్లు తోడు లేకుండా ప్రయాణం చేయొద్దు

ఆఫ్గాన్ మహిళలు ప్రయాణం  చేయడానికి కొత్త ఆంక్షలు తీసుకొచ్చింది తాలిబన్ ప్రభుత్వం. మహిళల వెంట మగాళ్లు తప్పకుండా ఉండాలని నిబంధన పెట్టింది. మినిస్ట్రీ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ విర్చ్యూ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్ అనే గైడ్ లైన్స్ జారీ చేసింది. అంతేకాకుండా మహిళలు తమ సాంప్రదాయం ప్రకారం ఇస్లామిక్ హిజాబ్స్ ని ధరించాలని, అట్లాంటి వారినే వాహనదారులు ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని సూచించింది.

 ‘‘45మైళ్ల (72కిలోమీటర్లు) కంటే ఎక్కువ దూరం ప్రయాణించే స్త్రీలు తమ కుటుంభంలోని మగాళ్లని కానీ, దగ్గరి బంధువులైన మగాళ్లని కానీ వెంట తీసుకురాకుంటే రైడ్ అంగీకరించవద్దు’’ అని మంత్రిత్వ శాఖ ప్రతినిధి సాడెక్ అకిఫ్ ముహాజిర్ మీడియాకు చెప్పారు. 

అది తప్పనిసరిగా దగ్గరి మగ బంధువు అయి ఉండాలని స్పష్టం చేశారు. మహిళా నటీనటులు నటించిన డ్రామాలు, వెబ్ సిరీస్ వంటి షోలను ప్రదర్శించడాన్ని కూడా నిలిపివేయాలని, టీవీలో వార్తలు చదివే వారు కూడా హిజాబ్స్ ధరించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. 

ప్రయాణం చేయాలనుకునే మహిళలకు కూడా హిజాబ్ అవసరమని ముహాజిర్ మీడియాకు చెప్పారు. ప్రజలు తమ వాహనాల్లో పాటలు ప్లే చేయడాన్ని కూడా నిలిపివేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

గత  ఆగష్టు లో పరిపాలన తాలిబన్ల ఆధీనంలోకి వచ్చినప్పటి నుండి మహిళలపై అనేక ఆంక్షలు విధిస్తున్నారు. అయితే తమ ప్రభుత్వంకు అంతర్జాతీయంగా గుర్తింపు రావడం కోసం, విదేశాల నుండి ఆగిపోయిన సహాయం పొందడం కోసం మహిళల పట్ల సానుకూలంగా ఉన్నట్లు చూపడం కోసం ఈ నెల మొదట్లో తమ పాలనలో మహిళల హక్కులకు ఢోకాలేదని భరోసా ఇచ్చారు. అయితే వారికి చదువుకొనే, ఉద్యోగం చేసే హక్కుల గురించి మౌనంగా ఉన్నారు.