ఐరోపాలో తీవ్రంగా విద్యుత్ సంక్షోభం

ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనిరీతిలో యూరప్‌ అత్యంత తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పలు దేశాలు విద్యుత్‌ కోతలను విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా కొసావో రిపబ్లిక్‌ రెండు గంటల పాటు విద్యుత్‌ కోతలను ప్రవేశపెట్టింది. 
 
గురువారం నుండి ఇది అమల్లోకి వచ్చినట్లు కొసావో ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్‌ సర్వీసెస్‌ (కెఇడిఎస్‌) ఒక ప్రకటనలో పేర్కొంది. కొసావో విద్యుత్‌ వ్యవస్థపై అధిక భారం పడిందని, సాధ్యమైనంతగా ఇంధనానిు ఆదాచేయాలంటూ పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేసిన తర్వాత ఇక విద్యుత్‌ కోతలను విధిస్తున్నట్లు ప్రకటించింది.
దాదాపు 20 లక్షల మంది జనాభాలో మెజారిటీ ప్రజలు ఈ కోతలను ఎదుర్కొంటున్నారు. ప్రజలు చాలా జాగ్రత్తగా విద్యుత్‌ను ఉపయోగించాల్సి వుందని కొసావో గ్రిడ్‌ మేనేజర్‌ ఒక ప్రకటనలో కోరారు. సాంకేతిక సమస్యల కారణంగా ఈ నెల ప్రారంభంలో దేశంలోని అతిపెద్దదైన బగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్‌ మూతపడింది. దీంతో అధిక ధరలకు విద్యుత్‌ను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.
 
సెర్బియా కూడా కొంతమేరకు కోతలు విధించింది. అదే సమయంలో బ్రిటన్‌ నెట్‌వర్క్‌ ఆపరేటర్‌ కూడా సరఫరాలకు సంబంధించి మొదటి హెచ్చరికను జారీ చేసింది. మరోవైపు గత వారం అణు రియాక్టర్‌ను అత్యవసరంగా నిలిపివేస్తున్నట్లు ఫ్రాన్స్‌ ప్రకటించింది. 
 
ఈ ఏడాది చివరిలోగా జర్మనీ తన అణు విద్యుత్‌ ఉత్పత్తిలో సగ భాగాన్ని నిలిపివేయాల్సి వుంది. ఈ విద్యుత్‌ సంక్షోభంతో యురోపియన్‌ గ్రిడ్‌లపై ఎన్నడూ లేనిభారం పడుతోంది.