హెచ్‌1బి వీసాలకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిలిపివేవేత

హెచ్‌1బి వీసాతో పాటు ఇతర వీసాలైన ఎల్‌-1, ఒ-1 అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. తాజా నిర్ణయంతో.. వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారు కాన్సులేట్‌కు వెళ్లి భౌతికంగా ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు.

2022 సంవత్సరానికి గానూ.. హెచ్‌-1బి సహా పలు రకాల వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తాత్కాలికంగా వ్యక్తిగత ఇంటర్వ్యూలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ  కీలక ప్రకటన విడుదల చేసింది.

నాన్‌ ఇమ్మిగ్రేంట్‌ వర్క్‌ వీసా హెచ్‌-1బితో పాటు, హెచ్‌-3, హెచ్‌-4, అంతర్గత కంపెనీ బదిలీలు (ఎల్‌ వీసాలు), అసాధారణ సామర్థ్యం కలిగిన వ్యక్తులకుజారీ చేసే ఒ వీసాలు, అథ్లెటిక్స్‌, కళాకారులు, తదితర రంగాలకు చెందిన వారికి జారీ చేసే పి వీసాలు, అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలు (క్యూ వీసాలు) కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వీసాలు జారీ చేసుందుకు దౌత్య కార్యాలయ అధికారులు ఆ అభ్యర్థులను వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేయాల్సి వుంటుంది. 

హెచ్​-2 వీసా, ఎఫ్​-ఎమ్​ వీసా, ఎకాడమిక్​ జే వీసాలపై ఇప్పటికే అమల్లో ఉన్న ఈ నిబంధనను.. 2022 డిసెంబర్​ 31 వరకు పొడగిస్తూ కాన్సులర్​ అధికారులకు విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్​ ఆదేశాలు జారీ చేశార. అయితే స్థానిక పరిస్థితులు, అవసరాల మేరకు కాన్సులేట్​ అధికారులు ఇన్​పర్సన్​ ఇంటర్వ్యూలకు పిలిచే అవకాశముంది. అందువల్ల సంబంధిత వెబ్​సైట్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని విదేశాంగశాఖ సూచించింది.

కరోనా మహమ్మారి ఫలితంగా డిపార్ట్‌మెంట్‌ వీసా ప్రాసెసింగ్‌ విధానం తగ్గింది. అంతర్జాతీయంగా ప్రయాణాలు పునరుద్ధరిస్తున్నందున జాతీయ భద్రతను కొనసాగిస్తూ వీసాల కోసం వేచి చూసే సమయాన్ని తగ్గించడానికి ఈ చర్యలు చేపడుతోంది. ఒక వేళ వ్యక్తిగత ఇంటర్వ్యూలు తప్పనిసరని భావిస్తే.. స్థానిక పరిస్థితులను అనుసరించి కాన్సులేట్‌ అధికారులకు పూర్తి భాద్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపింది.