మయన్మార్ మీదుగా భారత్‌లోకి చొరబడుతున్న ఉగ్రవాదులు

ఈ ఏడాది ప్రారంభంలో మయన్మార్‌లో జరిగిన సైనిక తిరుగుబాటు తర్వాత, భారత భద్రతా సంస్థలు భయపడినట్టే ఇప్పుడు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. భారత్-మయన్మార్ సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు కనిపిస్తున్నారు. అదే సమయంలో, వారి ఉగ్రవాద శిబిరాల కార్యకలాపాలు కూడా అకస్మాత్తుగా తీవ్రమయ్యాయి.

భారతదేశం, మయన్మార్ సైన్యాలు సంయుక్త ఆపరేషన్ తర్వాత 2019 లో ఈ శిబిరాలన్నింటిని ఖాళీ చేయడంతో ఉగ్రవాద కార్యకలాపాలు అక్కడ ఆగిపోయాయి. అయితే సైనిక పాలన వచ్చిన  తర్వాత, గత కొన్ని నెలలుగా ఈ శిబిరాలు మళ్లీ చురుకుగా మారాయి. 

 
ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం, మయన్మార్‌లోని చిన్ స్టేట్‌లో ఉగ్రవాద సంస్థలు పీఎల్ ఎ, ఆర్ పి ఎఫ్ కార్యకలాపాలు పెరిగాయి. వారి సంఖ్య దాదాపు 18-20 వరకు ఉంటుందని, వారి ఉనికి సరిహద్దుకు ఆనుకుని ఉన్న సేనామ్ నుండి సియాల్మీ వరకు వ్యాపించినదని చెబుతున్నారు.

భారత ఏజెన్సీలకు అందిన సమాచారం ప్రకారం, ఈ ఉగ్రవాదులు గత నెలలో మణిపూర్ సరిహద్దులో 46వ అస్సాం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బిప్లబ్ త్రిపాఠి, అతని భార్య,  కొడుకుతో పాటు మరో 4 మంది సైనికులను హతమార్చారు. ఆ ఘటన తర్వాత వారంతా సురక్షిత స్వర్గాన్ని వెతుక్కుంటూ మయన్మార్ సరిహద్దుల్లోకి ప్రవేశించి ఇప్పటికీ సియాల్మీ సమీపంలోని అడవుల్లో తలదాచుకుంటున్నారు.

ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం, యుఎన్ఎల్ఎ,  పిఎల్ఎ, ప్రీప్యాక్ కు చెందిన 150 మంది ఉగ్రవాదులను చిన్ స్టేట్ గ్రామాలకు తీసుకువచ్చారు.  తద్వారా వారు భారతదేశంలోకి చొరబడ్డారు. అదేవిధంగా, ఇటీవల మయన్మార్ నుండి చొరబడిన తిరాప్, చాంగ్లాంగ్ జిల్లాలలో డజన్ల కొద్దీ ఎన్ ఎస్ సి ఎన్ (కెవైఎ) ఉగ్రవాదులు చురుకుగా తిరుగుతున్నారు.

వివిధ ఉగ్రవాద ముఠాలకు చెందిన 30-40 మంది ఉగ్రవాదులు మణిపూర్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. రానున్న రోజుల్లో మణిపూర్‌తో పాటు నాగాలాండ్‌లోనూ తీవ్రవాద ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఏడాది ప్రారంభంలో మయన్మార్‌లో స్థావరం ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాద ముఠాలపై మయన్మార్ ఆర్మీతో పాటు భారత సైన్యం భారీ చర్యలు చేపట్టింది. కొన్ని వారాల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంతోపాటు ఉగ్రవాదులు హతమయ్యారు.