బ్రిటన్‌, అమెరికాలలో ఉధృతంగా ఒమిక్రాన్‌

కరోనా వైరస్‌తో అల్లకల్లోలమైన బ్రిటన్‌, అమెరికాలో కొత్త వేరియంట్‌ ఉద్ధృతి క్రమంగా పెరుగుతున్నది. బ్రిటన్‌లో బుధవారం ఒక్కరోజే 1,06,122 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయి ఉద్ధృతికి ఒమిక్రానే కారణమని వైద్య నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ వీలైనంత తొందరగా బూస్టర్‌ డోసు వేసుకోవాలని సూచిస్తున్నారు. 

అమెరికాలో కూడా రోజూవారీ కేసుల సంఖ్య 1.8 లక్షలకు తగ్గట్లేదు. ఒమిక్రాన్‌ వ్యాప్తితోనే కేసుల సంఖ్య ఈ స్థాయిలో పెరుగుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోనూ కేసులు పెరుగుతుండటంతో పిల్లలకు వ్యాక్సిన్‌ వేయించడానికి తల్లిదండ్రులు టీకా కేంద్రాలకు పోటెత్తుతున్నారు. స్పెయిన్‌, జర్మనీ, ఇటలీ, రష్యాలో కూడా కేసుల్లో అనూహ్య పెరుగుదల కనిపిస్తున్నది.

కాగా, బ్రిటన్‌లో కరోనా సెల్ఫ్‌ ఐసొలేషన్‌ సమయాన్ని పది రోజుల నుండి ఏడు రోజులకు తగ్గించారు. క్వారంటైన్‌ ప్రారంభమైనప్పటి నుండి ఆరు, ఏడు రోజుల్లో వరుసగా రెండు నెగిటివ్‌ (లేటరల్‌ ఫ్లో టెస్ట్‌ాఎల్‌ఇటి) ఫలితాలు వస్తే వారి క్వారంటైన్‌ను ఇక అక్కడితో ముగించేయవచ్చునని బ్రిటన్‌ ఆరోగ్య శాఖ కార్యదర్శి సాజిద్‌ జావిద్‌ తెలిపారు.

ఫ్రంట్‌లైన్‌ సర్వీసులకు, వ్యాపారాలకు కలిగే ఇబ్బందులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకైతే ఒకసారి పాజిటివ్‌ వస్తే పూర్తిగా పది రోజులు క్వారంటైన్‌లో వుండాల్సిందే. ఏడు రోజుల తర్వాత క్వారంటైన్‌ నుండి బయటకు వచ్చినా ఆ వ్యక్తి జాగ్రత్తగా వుండాల్సిందేనని స్పష్టం చేశారు.

క్రిస్మస్‌ అనంతరం ఆంక్షలు విధించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ చెప్పారు. ఉత్తర ఐర్లాండ్‌లో ఇప్పటికి మూడు వారాల నుండి బహిరంగ కార్యక్రమాలను రద్దుచేశారు.

త్వరలోనే ఫ్రాన్స్‌లో రోజుకు లక్ష కేసులు వరకు నమోదవుతాయని ఫ్రాన్స్‌ ఆరోగ్య శాఖ మంత్రి ఆలీవర్‌ వెరాన్‌ చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఐదవ వేవ్‌ నడుస్తోంది. ప్రతిరోజూ దాదాపు 70వేల కేసులు నమోదవుతున్నాయి. జనవరి ప్రారంభానికల్లా ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రాబల్యం బాగా ఎక్కువవుతుందని చెప్పారు. 

ఇప్పటికైతే కొత్తగా ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపారు. ఎక్కువమంది వ్యాక్సిన్లు వేసుకుంటే వైరస్‌ అదుపులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఫ్రాన్స్‌లో 210మంది కోవిడ్‌తో మరణించారు.

చైనాలోని జియాన్‌ నగరంలో కరోనా కొత్త కేసులు పెరుగుతుండడంతో అధికారులు లాక్‌డౌన్‌ విధించారు. దీంతో దాదాపు 1.3 కోట్ల మంది ప్రజలు ఇండ్లకే పరిమితం అయ్యారు. ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు కరోనా టీకా నాలుగో డోసు వేయాలని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం నిర్ణయించింది. మూడో డోసు వేసుకొని నాలుగు నెలలు గడిచిన వారికి నాలుగో డోసు వేయనున్నారు.