పాక్ సేనలను హెచ్చరించిన భారత్ సైన్యం

భార‌త స‌రిహ‌ద్దుకు స‌మీపంలో పాక్ సైన్యం ఓ నిర్మాణం చేప‌ట్ట‌డానికి ప్ర‌య‌త్నించ‌డంతో భార‌త సైన్యం అప్రమత్తమైంది. కుప్వారా ప్రాంతంలోని టీట్‌వాల్ సెక్టార్‌లోని ఎల్ఓసీ మీదుగా 500 మీట‌ర్ల ప‌రిధిలో పాక్ ఈ నిర్మాణం చేప‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ వ్య‌వ‌హారం భార‌త సైనికుల దృష్టిలో ప‌డింది. 

దీంతో భార‌త సైనికులు ఆ నిర్మాణాన్ని ఆపాలంటూ పాకిస్తాన్ సైన్యాన్ని మైక్‌లో తీవ్రంగా హెచ్చ‌రించారు. దీంతో పాక్ సైనికులు త‌క్ష‌ణ‌మే ఈ నిర్మాణాన్ని ఆపేశారు. ”ఈ నిర్మాణాన్ని త‌క్ష‌ణ‌మే నిలిపేయాలి. ప్రోటోకాల్ ప్ర‌కారం ఆ స్థ‌లంలో ఏ నిర్మాణ‌మూ చేప‌ట్ట‌రాదు. దీనిని గ‌మ‌నంలోకి తీసుకొని ఈ నిర్మాణ ప‌నుల‌ను త‌క్ష‌ణ‌మే నిలిపేయాలి” అంటూ స్పష్టం చేశారు.

“500 మీట‌ర్ల లోపు నిర్మాణాన్ని చేప‌డుతున్నారు. నిర్మాణం వ‌ద్ద‌ని ప‌దే ప‌దే చెబుతూనే ఉన్నాం. మీరు మాత్రం నిర్మాణ పనులు ఆప‌డం లేదు. మ‌రోసారి హెచ్చ‌రిస్తున్నాం. విన‌కుంటే… మ‌రో రూపంలో మీకు చెప్పాల్సి ఉంటుంది. మ‌రో ర‌కంగా రంగంలోకి దిగాల్సి వ‌స్తుంది” అని భార‌త సైన్యం పాక్ సైన్యాన్ని మైకులో తీవ్రంగా హెచ్చ‌రించింది.

ఇక టీట్‌వాల్ గ్రామానికి చెందిన ప్ర‌జ‌లు కూడా ఈ నిర్మాణాన్ని నిలిపేయాల‌ని పాక్ సైనికుల‌ను మైక్‌లో హెచ్చ‌రిస్తూనే వున్నారు. అయినా పాక్ సైన్యం పెడ‌చెవిన పెట్టింది. దీంతో గ్రామ ప్ర‌జ‌లు సైన్యం దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో సైన్యం మైక్‌లో పాక్ సైన్యాన్ని తీవ్రంగా హెచ్చ‌రించింది.