కరాచీలో హిందూ ఆలయంలో విగ్రహాల ధ్వంసం

పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో ఉన్న ఒక హిందూ ఆలయంలోని దేవతా విగ్రహాలు విధ్వంసానికి గురయ్యాయి. కరాచీలోని పాత నగరం నారాయణ్‌పురాలోగల నారాయణ్ మందిరంలో సోమవారం ఈ సంఘటన జరిగినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు.
 
దేవతా మూర్తుల విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన ముహమ్మద్ వలీద్ షబ్బీర్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి సర్ఫరజ్ నవాజ్ తెలిపారు. 
 
సోమవారం సాయంత్రం నారాయణ్ మందిరంలో ముఖేష్ కుమార్ అనే హిందువు తన భార్యతో కలసి ప్రార్థనలు చేస్తుండగా దేవతా మూర్తుల విగ్రహాలను ఒక వ్యక్తి సుత్తితో కొట్టి ధ్వంసం చేయడాన్ని చూశారని ఆయన తెలిపారు. 
 
ఆ సమయంలో అక్కడే ఉన్న ఇతర హిందువులు ఆగ్రహోదగ్రులై విగ్రహాల విధ్వంసానికి పాల్పడిన ఆ దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని ఆయన చెప్పారు. ఆ వ్యక్తిని షబ్బీర్‌గా గుర్తించినట్లు పోలీసు అధికారి చెప్పారు. 
 
ఈ సంఘటన అనంతరం ఆ ప్రాంతానికి చెందిన హిందువులు పోలీసు స్టేషన్ బయట నిరసన ప్రదర్శన నిర్వహించి హిందు ఆలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.