వెబ్‌సైట్‌లో జీవోలు పెట్టట్లేదని ఏపీ హైకోర్టు సీరియస్

జీవోఐఆర్టీ వెబ్‌సైట్‌లో జీవోలు ఎందుకు పెట్టట్లేదని ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సాఫీగా జరిగిపోయే ప్రక్రియకు ఆటంకం కల్పించడంపై ధర్మాసనం సీరియస్ అయింది. వెబ్‌సైట్‌లో జీవోలను ఉంచకపోవడంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. 

పిటిషనర్ తరఫున న్యాయవాది ఎలా మంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం విడుదల చేసే జీవోల్లో ఐదు శాతం మాత్రమే వెబ్ సైట్‌లో ఉంచుతున్నారని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4 ఎనిమిదిలకు విరుద్ధమని స్పష్టం చేశారు. 

టాప్ సీక్రెట్ జీవోలు అప్‌లోడ్  చేయట్లేదని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. జీవోలు సీక్రెట్, టాప్ సీక్రెట్ అని ఎలా నిర్ణయిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. 

ప్రభుత్వం ఎన్ని జీవోలు విడుదల చేసింది.. ఎన్ని జీవోలు వెబ్‌సైట్లో ఉంచింది.. సీక్రెట్ అంటూ అప్‌లోడ్ చేయని జీవోల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.