క్రిప్టోకరెన్సీలను  నిషేధించే బదులు నియంత్రణ మేలు 

క్రిప్టోకరెన్సీలను నిషేధించే బదులుగా వాటిని నియంత్రణలోకి తీసుకురావడం చాలా మంచిదని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌)లో డిప్యూటీ మేనేజింగ్‌ డైరక్టర్‌ పదవి స్వీకరించనున్న చీఫ్‌ ఎకనమిస్ట్‌ గీతా గోపినాథ్‌ సూచించారు. 

ఢిల్లీలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంటూ అభివృద్ధి చెందే దేశాల ఆర్థిక వ్యవస్థలకు క్రిప్టోకరెన్సీలు  ప్రత్యేక సవాలుగా నిలుస్తాయని ఆమె తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు క్రిప్టోకరెన్సీలు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయని ఆమె చెప్పారు.

అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు మారకపు రేటు నియంత్రణలను కలిగి ఉంటాయి. మూలధన ప్రవాహ నియంత్రణలను క్రిప్టోకరెన్సీలు ప్రభావితం చేసే అవకాశం ఉందని గీతా పేర్కొన్నారు.

క్రిప్టోకరెన్సీలను ఇన్వెస్టర్లు ఒక పెట్టుబడి ఆస్తిలాగానే ఉపయోగిస్తున్నారని, ఆయా దేశాల్లో పెట్టుబడికి సంబంధించిన నియమాలను డిజిటల్‌ కరెన్సీపై కూడా వర్తించేలా చూడాలని గీతా సూచించారు. భారత ప్రభుత్వం క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని చూస్తున్న తరుణంలో గోపీనాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

కాగా క్రిప్టోకరెన్సీ బిల్లుపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. క్రిప్టోకరెన్సీపై కేంద్ర ప్రభుత్వం బిల్లును తెచ్చే వరకు వేచి చూడాల్సిందే.