రైల్వేల్లో మహిళల కోసం ప్రత్యేక బెర్త్‌లు

సుదూర రైళ్లలో మహిళా ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించేందుకు భారతీయ రైల్వేలు మహిళల కోసం ప్రత్యేక బెర్త్‌లు, ఇతర సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నది. 
 
దూర ప్రాంతాలకు వెళ్లే మెయిల్‌ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్లీపర్ క్లాసుల్లో 6 బెర్త్‌లు, అలాగే గరీబ్ రథ్, రాజధాని, దురంతో, ఫుల్‌ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని 3 ఏసీ క్లాసుల్లో 6 బెర్త్‌లు మహిళలకు రిజర్వ్ చేయనున్నాం’ అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. ఒంటరిగా లేదా మహిళల సమూహంతో ప్రయాణించే వారి వయస్సుతో సంబంధం లేకుండా మహిళా ప్రయాణికులకు కోటా వర్తిస్తుందని తెలిపారు. 
 
ప్రతి స్లీపర్‌ కోచ్‌లో ఆరు నుంచి ఏడు లోయర్‌ బెర్త్‌లు, 3 ఏసీ కోచ్‌లలో నాలుగు నుంచి ఐదు లోయర్‌ బెర్త్‌లు, 2 ఏసీ కోచ్‌లలో మూడు నుంచి నాలుగు బెర్త్‌లు సీనియర్ సిటిజన్‌లు, 45 ఏండ్ల వయసు పైబడిన మహిళలు, గర్భిణులకు రిజర్వ్ చేస్తారని రైల్వే మంత్రి చెప్పారు.
 
రైళ్లలోని కోచ్‌ల సంఖ్యను బట్టి ఈ క్యాటగిరీ సీట్ల రిజర్వ్‌డ్ కోటా నిర్ణయించబడుతుందని తెలిపారు. అదేవిధంగా, మహిళలతో పాటు అన్ని క్యాటగిరీల ప్రయాణికులకు ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ, డిస్ట్రిక్ట్ పోలీసుల ఆధ్వర్యంలో భద్రతను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు.
 
 సగానికి తగ్గిన కాగితం వినియోగం
 
కాగా,  రైల్వేలో కాగితం వినియోగం సగానికి తగ్గింది. ప్రయాణికులు టికెట్‌ బుకింగ్‌కు ఎక్కువగా ఆన్‌లైన్‌కు మొగ్గుచూపడం దీనికి కారణంగా తెలుస్తున్నది. 2018లో 22,685 రీమ్‌ల పేపర్‌ను వినియోగించగా 2021లో కాగిత వినియోగం 10,272 రీమ్‌లకు తగ్గిందని రైల్వే మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలో కాగితం ప్రిటింగ్‌కు అయ్యే ఖర్చు కూడా భారీగానే తగ్గిందని కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏఆర్‌పీజీ) తెలిపింది. 2019-20లో కాట్రిడ్జ్‌ల ఖర్చు రూ. 1.3 కోట్లతో పోలిస్తే 2022 మార్చి నాటికి కాట్రిడ్జ్‌ల ఖర్చు రూ.50 లక్షలు మేరకు తగ్గుతుందని అంచనా వేసింది.
 

మరోవైపు, మంత్రిత్వ శాఖలు ఈ-ఆఫీస్ వెర్షన్ 5.6 నుంచి వెర్షన్ 6.0కి అప్‌గ్రేడ్ అయ్యాయని డీఏఆర్‌పీజీ తెలిపింది. అనేక మంత్రిత్వ శాఖలు ఈ-ఆఫీస్ వెర్షన్ 7.0కు అప్‌గ్రేడ్‌ అయినట్లు పేర్కొంది. MelTY, DARPG, టెలికాం, పోస్టల్‌ వంటివి ఈ-ఆఫీస్ వెర్షన్ 7.0కి మారిన మంత్రిత్వ శాఖలలో ఉన్నాయని వెల్లడించింది. ఎన్‌ఐసీ ద్వారా వెర్షన్‌ రోల్-అవుట్ ప్లాన్ రూపొందించినట్లు వివరించింది.