ఈడీ ముందు హాజరైన ఐశ్వ‌ర్యారాయ్‌

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ప‌నామా పేప‌ర్ లీక్‌ కేసులో అమితాబ్‌బ‌చ్చ‌న్ కుటుంబానికి స‌మ‌స్య‌లు అంత‌కంత‌కే పెరుగుతున్నాయి. ఈ కేసులో ఇప్ప‌టికే అభిషేక్ బ‌చ్చ‌న్‌ను విచారించిన ఈడీ ముందు తాజాగా ఆయ‌న భార్య ఐశ్వ‌ర్యారాయ్ బ‌చ్చ‌న్‌ నేడు హాజరయ్యారు. 

ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఆమె ఢిల్లీలోని లోక్‌నాయ‌క్ భ‌వ‌న్‌లో ఈడీ ముందు విచార‌ణ‌కు హాజ‌రయ్యారు. ఈ కేసులో ఐశ్వ‌రాయ్ బ‌చ్చ‌న్‌ను ప్ర‌శ్నించేందుకు ఇప్ప‌టికే ప‌శ్న‌ల జాబితాను కూడా సిద్ధం చేసిన‌ట్లు ఈడీ వ‌ర్గాలు తెలిపాయి.

విదేశాల్లో సంపదను దాచారనే ఆరోపణలపై 48 ఏళ్ల ఐష్ ను ఈడీ ప్రశ్నించనుంది. ఇప్పటికే రెండుసార్లు ఈడీ ముందు హాజరవ్వాలని ఐశ్వర్యకు సమన్లు జారీ అయ్యాయి. కానీ తనకు మరింత సమయం ఆమె కావాలని కోరింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈడీ మరోమారు నోటీసులు ఇవ్వడం గమనార్హం. 

ప‌నామా పేప‌ర్ లీక్ కేసులో 500 మంది భార‌తీయుల‌కు ప్ర‌మేయం ఉన్న‌ది. వారిలో రాజ‌కీయ నాయ‌కులు, న‌టులు, క్రీడాకారులు, వ్యాపార‌వేత్త‌లు త‌దిత‌రుల పేర్లు ఉన్నాయి. వీరంతా ప్ర‌భుత్వానికి ప‌న్నులు ఎగ‌వేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. దాంతో ఇన్‌క‌మ్ ట్యాక్స్ అధికారులు కూడా ఈ ద‌ర్యాప్తులో పాల్గొంటున్నారు.

ప‌నామా పేప‌ర్ లీక్ కేసులో చాలాకాలంగా ద‌ర్యాప్తు జ‌రుగుతున్న‌ది. గ‌త నెల ఐశ్వ‌రాయ్ భ‌ర్త అభిషేక్ బ‌చ్చ‌న్ కూడా ఈ కేసులో ఈడీ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న నుంచి కొన్ని డాక్యుమెంట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పుడు ఐశ్వ‌ర్యారాయ్‌ను విచార‌ణ‌కు పిలిచిన ఈడీ త్వ‌ర‌లో అమితాబ్ బ‌చ్చ‌న్‌కు కూడా స‌మ‌న్‌లు పంపే అవ‌కాశం ఉన్న‌ది. 2016లో యూకేలో ప‌నామా బేస్డ్ లా సంస్థ‌కు చెందిన‌ 11.5 కోట్ల ట్యాక్స్ డాక్యుమెంట్లు లీక‌య్యాయి.