త్వరలో రష్యా, చైనా, భారత్ శిఖరాగ్ర సదస్సు!

చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌తో స‌మీప భ‌విష్య‌త్తులో భార‌త ప్ర‌ధాని నరేంద్ర  మోదీ భేటీ అవుతార‌ని ర‌ష్యా వెల్ల‌డించింది. ర‌ష్యా అధ్య‌క్ష భ‌వ‌న కార్యాల‌యం దీనిపై ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఆ భేటీలో అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా పాల్గొన‌నున్న‌ట్లు తెలిసింది.
ర‌ష్యా, భారత్, చైనా మ‌ధ్య త్వ‌ర‌లోనే శిఖ‌రాగ్ర స‌ద‌స్సు జ‌ర‌గ‌నున్న‌ట్లు ర‌ష్యా అధ్య‌క్ష భ‌వ‌న అధికారి యూరీ ఉష‌కోవ్ స్థానిక వార్తాసంస్థ‌కు తెలిపారు. అయితే ఈ మధ్యనే ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ కు   వ‌చ్చి వెళ్లిన విష‌యం తెలిసిందే. ర‌ష్యాతో ఆయుధాల ఒప్పందం కుదుర్చుకున్న నేప‌థ్యంలో.. మోదీని ఢిల్లీలో పుతిన్ క‌లిశారు.
ఇటీవ‌ల పుతిన్‌, జిన్‌పింగ్ మ‌ధ్య జ‌రిగిన వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో  ర‌ష్యా, భారత్, చైనా మ‌ధ్య స‌హ‌కారం గురించి చ‌ర్చ వ‌చ్చింద‌ని, అయితే ఆర్ఐసీ నియ‌మావ‌ళి ప్ర‌కారం త్వ‌ర‌లోనే ఈ మూడు దేశాల మ‌ధ్య స‌ద‌స్సు జ‌ర‌గ‌నున్న‌ట్లు క్రెమ్లిన్ ప్ర‌తినిధి ఉష‌కోవ్ తెలిపారు. ఢిల్లీకి పుతిన్ వెళ్లిన అంశాన్ని చైనా అధ్య‌క్షుడికి తెలియ‌జేసిన‌ట్లు కూడా ఆయ‌న చెప్పారు.