ఢాకాలో భారత రాష్ట్రపతి కోవింద్ కు ఘన స్వాగతం

బాంగ్లాదేశ్ లో మూడు రోజుల పర్యటనకు బుధవారం ఢాకా చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఘనస్వాగతం లభించింది. 1971లో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ స్వాతంత్య్రం  పొందిన స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. కోవింద్ రాకతో 21 తుపాకుల గౌరవ వందనం జరిగింది. 
 
కోవింద్ తన భార్య సవితా కోవింద్, కుమార్తె స్వాతి కోవింద్‌తో కూడిన అధికారిక ప్రతినిధి బృందంతో కలిసి ప్రత్యేక ఎయిర్ ఇండియా వన్ విమానంలో ఢాకా చేరుకున్నారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎం. అబ్దుల్ హమీద్ ఢాకాలోని హజ్రత్ షా జలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సతీమణి రషీదా ఖానుమ్‌ తో కలసి స్వాగతం పలికారు.

కోవింద్‌కు స్వాగతం పలికేందుకు పలువురు ఉన్నతాధికారులతో పాటు సివిల్‌, మిలటరీ అధికారులు విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో స్వాగత కార్యక్రమంలో భాగంగా బంగ్లాదేశ్ ఆర్మీ, నేవీ,  వైమానిక దళ సిబ్బంది ఆయనకు రక్షణగా స్వాగతం పలికారు, అక్కడి నుండి రాష్ట్రపతి కోవింద్ రాజధాని వెలుపల సవర్‌లోని జాతీయ స్మారక చిహ్నం వద్దకు కాన్వాయ్‌లో వెళ్లారు.

 
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన తర్వాత రాష్ట్రపతి కోవింద్ విదేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి. ఇక్కడ జరిగే బంగ్లాదేశ్ 50వ విజయ దినోత్సవ వేడుకల్లో భారత్ తరపున ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు. బాంగ్లాదేశ్ ఆవిర్భావంకు దారితీసిన 1971లో జరిగిన భారత్ – పాకిస్తాన్ యుద్ధం  50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రెండు దేశాల మధ్య గల సన్నిహిత సంబంధాలను ప్రతిబింబించే విధంగా భారతదేశం కూడా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
 
బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎకె అబ్దుల్ మోమిన్ మంగళవారం ఇక్కడ జరిగిన డిజిటల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాష్ట్రపతి కోవింద్ పర్యటనను “సంబరం”గా అభివర్ణించారు, ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలను ఆయన పర్యటనలో కవర్ చేస్తామని తెలిపారు.

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎం అబ్దుల్ హమీద్ ఆహ్వానం మేరకు రాష్ట్రపతి కోవింద్ డిసెంబర్ 15 నుంచి 17 వరకు బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు.  ఇది రెండు పొరుగు దేశాల మధ్య సత్సంబంధాలకు విశిష్ట సంకేతమని మోమిన్ చెప్పారు. రాష్ట్రపతి కోవింద్ నెలలపాటు  

 
1971లో తొమ్మిది నెలల బంగ్లాదేశ్ విముక్తికి పోరాడి ప్రాణత్యాగాలు చేసిన అమరుల స్మారకం వద్ద కోవింద్ పుష్పగుచ్ఛాన్ని ఉంచారు. అక్కడి స్మారక ఉద్యానవనంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘అశోక చెట్టు మొక్కను కూడా నాటారు.సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. బంగ్లాదేశ్ స్వాతంత్య్రం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనడం తనకు ఆనందకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 
 
రాష్ట్రపతి కోవింద్ ఢాకాలోని ధన్‌మొండి ప్రాంతంలో బంగబంధు షేఖ్ ముజీబుర్రహ్మాన్ స్మారక మ్యూజియంను కూడా సందర్శించి, ముజిబుర్ రెహమాన్‌కు నివాళులర్పించారు. కోవింద్‌ను బంగ్లాదేశ్ ప్రధాని షేఖ్ హసీనా బుధవారం కలుసుకున్నారు. వారిరువురు అనేక పరస్పర ప్రయోజనాలు, ద్వైపాక్షిక సహకారంకు సంబంధించిన విషయాలపై చర్చించారు.
 
బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎ.కె.అబ్దుల్ మోమెన్ కూడా రాష్ట్రపతిని కలిశారు. రెండు దేశాల నడుమ మైత్రిని మరింత పటిష్టపరుసస్తామని వారు పునరుద్ఘాటించారు. మోమెన్ రాష్ట్రపతితో ద్వైపాక్షిక విషయాలను కూడా చర్చించారు. 

1971 డిసెంబర్ 16న సుమారు 93,000 మంది పాకిస్తానీ సైనికులు భారత సైన్యం, ‘ముక్తి బాహిని’ సంయుక్త దళాలకు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగే బంగ్లాదేశ్‌ స్వర్ణోత్సవం, 1971 యుద్ధ విజయోత్సవ వేడుకల్లో భారత గౌరవ అతిథిగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొంటారు. 

భారత త్రివిధ దళాలకు చెందిన 122 మందితో కూడిన కాంటిజెంట్‌ కూడా ఈ పరేడ్‌లో భాగస్వామ్యమవుతుంది. మూడు రోజుల పర్యటనలో బంగ్లాదేశ్‌ విముక్తి యోధులతోపాటు, భారత మాజీ ఆర్మీ అధికారులతో కూడా రాష్ట్రపతి రా‌మ్‌నాథ్‌ సమావేశమవుతారు. 

పర్యటన మూడో రోజున అంటే డిసెంబర్ 17న కోవింద్ ఢాకాలోని మధ్య ప్రాంతంలో రమ్నా వద్ద పునరుద్ధరించిన కాళీ మందిరాన్ని సందర్శించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఆయన భారత్‌కు తిరుగు పయనం కానున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.