బీసీసీఐ వ్యవహారం ఎండగట్టిన విరాట్ కోహ్లీ!

ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రీడా సంఘాలలో ఒకటైన బీసీసీఐ వ్యవహారం పట్ల చాలాకాలంగా విమర్శలు చెలరేగుతున్నాయి. అందులో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారు క్రీడాకారులను ప్రోత్సహించడంపై కన్నా క్రీడా రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో సుప్రీం కోర్ట్ జోక్యం చేసుకొని, బీసీసీఐలో సంస్కరణలకు కొంతమేరకు దోహదం చేసింది. 
 
అయినా దాని వ్యవహారంలో చెప్పుకోదగిన మార్పు రాలేదని తాజాగా విరాట్ కోహ్లీ పట్ల వ్యవహరించిన తీరు వెల్లడి చేస్తున్నది. పైగా, క్రీడాకారుల మధ్య చీలికలు తెచ్చే విద్యంగా కీలక వ్యక్తులు వ్యవహరిస్తున్నట్లు భావించవలసి వస్తున్నది. ఓకే రోజు క్రికెట్ లో భారత్ కు ఘనమైన విజయాలు మూటగట్టుకు వచ్చి,  ప్రపంచంలోనే విజయవంతమైన నాల్గవ కెప్టెన్ గా పేరొందిన కోహ్లీని అర్ధాంతరంగా తొలగించిన తీరు విమర్శలకు గురవుతున్నది. 
 
ఆ విధమైన నిర్ణయం తీసుకోవడానికి బిసిసిఐకి సహేతుకరమైన కారణాలు ఉన్నప్పటికీ,  ఆ నిర్ణయాన్ని వెల్లడించిన విధానమే ప్రముఖ క్రీడాకారుడిని అవమానపరిచే విధంగా ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. పైగా, ఈ సందర్భంగా కొన్ని అసంబద్ధమైన కధనాలు మీడియాలో రావడానికి బీసీసీఐ కారణం అనే ఆరోపణలు సహితం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ మీడియా ముందుకు వచ్చి, బీసీసీఐ తీరుతెన్నలను ఎండగట్టారు. 
 
గత కొన్ని రోజులుగా కోహ్లీ విషయంలో బీసీసీఐ చెబుతున్న కధనాలు అబద్ధాలని స్వయంగా కోహ్లీ చెప్పుకోవలసి రావడం గమనార్హం. వన్డే కెప్టెన్సీ మార్పు విషయంలో టెస్టు జట్టును ప్రకటించడానికి గంటన్నర ముందు  జట్టు ఎంపిక గురించి తనతో ఫోన్ లో చర్చిస్తూ, చివరిలో కెప్టెన్సీ నంచి తప్పిస్తున్నట్లు సమాచానం ఇచ్చారని కోహ్లీ వెల్లడించారు. 
 
 అయితే వన్డే కెప్టెన్సీ మార్పు గురించి రెండు రోజుల ముందుగానే కోహ్లీకి సమాచారమిచ్చామని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలి గతంలో ప్రకటించడం గమనార్హం. పైగా, ఇటీవల తాను టి20 జట్టు కెప్టెన్సీ నుండి వైదొలుగుతున్నట్లు చెప్పినప్పుడు, వద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేసిన్నట్లు గంగూలీ చేసిన ప్రకటనను కూడా కోహ్లీ ఖండించారు. తనను బీసీసీఐలో ఎవ్వరు తన ప్రకటనను మార్చుకోమని సూచింపలేదని స్పష్టం చేశారు. 
 
కోహ్లీ ప్రకటన చూస్తుంటే అతనిని కెప్టెన్సీ నుండి తప్పించడం కోసం ఒక పధకం మేరకు ప్రయత్నాలు జరిగిన్నట్లు వెల్లడి అవుతుంది. ”వన్డే కెప్టెన్సీ మార్పు విషయంలో బీసీసీఐ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో నేను అర్థం చేసుకోగలను. కెప్టెన్‌గా నాకు అప్పగించిన బాధ్యతలను నిజాయతీగా నిర్వర్తించాను. జట్టుకోసం శాయశక్తులా శ్రమించాను” అని చెప్పారు. 
 
“టి20 కెపెటన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా బీసీసీఐ అధికారులకు సమాచారం ఇచ్చాను. అప్పుడు వారి నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. టీ 20 నాయకత్వాన్ని వదిలేయడాన్ని నా కెరీర్ లో ఓ విప్లవాత్మకమైన మార్పుగా భావించాను. వన్డేలకు , టెస్టులకు మాత్రం కెప్టెన్‌గా కొనసాగుతానని, బీసీసీఐకి అప్పుడు తెలియజేశాను. 2023 వన్డే ప్రపంచకప్‌ వరకు కెప్టెన్‌గా కొనసాగుతానని చెప్పాను” అని వివరించాడు. 
 
కాగా, దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సీరిస్‌ నుంచి తప్పుకున్నట్లు వచ్చిన వార్తలను కోహ్లీ ఖండించారు. విరామం కావాలని తాను బీసీసీఐని సంప్రదించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసాడు.  ”దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సీరిస్‌ నుంచి విరామం కావాలని బీసీసీఐని సప్రదించలేదు. సెలక్టర్లకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే సీరిస్‌లో పాల్గంటాను. వన్డే సీరిస్‌కు నేను అందుబాటులో ఉండనని భావిస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే ” అని కోహ్లీ పేర్కొన్నాడు. 
 
మరోవంక, నూతన కెప్టెన్ గా నియమించిన రోహిత్ శర్మతో తనకు విబేధాలు ఉన్నట్లు వస్తున్న కథనాలను కూడా కోహ్లీ కొట్టిపారవేసారు. ”నాకు రోహిత్‌కు మధ్య ఎలాంటి విభేధాలు లేవు. గత రెండు సంవత్సరాలుగా ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పి అలసిపోయాను” అంటూ తెలిపారు. 
 
“నా చర్యలు గానీ, నిర్ణయాలు గానీ జట్టు స్థాయిని దిగజార్చేలా ఉండవు. వ్యూహాల విషయంలో రోహిత్‌ సమర్థవంతమైన నాయకుడు. హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో కలిసి జట్టును మరింత మెరుగ్గా ముందుకు నడిపిస్తాడనుకుంటున్నాను. టీ 20 వన్డే క్రికెట్లో వారికి సంపూర్ణ సహకారం అందిస్తాను.” అని కోహ్లీ భరోసా ఇచ్చాడు.