రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి ప్రశంస!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరు చెబితేనే బిజెపి మంత్రులు, నాయకులు మండిపడుతూ ఉంటారు. కానీ మొదటి సారిగా ఒక కేంద్ర మంత్రి ఆయన పట్ల ప్రశంసాపూర్వకంగా మాట్లాడారు. రాహుల్ గాంధీ మొదటిసారి లోక్ సభలో ఒక అంశంపై నోటీసు ఇచ్చి,, ప్రస్తావించడంను మెచ్చుకున్నారు
 
 లఖింపూర్ ఘటనపై చర్చ జరపాలంటూ  రాహుల్ గాంధీ లోక్‌సభలో ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసుపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ  ”రాహుల్ మెరుగుపడ్డారు. కనీసం నోటీసులైనా ఇస్తున్నారు” అంటూ ఎద్దేవా చేశారు. 
 
రాహుల్ గాంధీకి ఇంతకు ముందు పార్లమెంటు అంటే ఎలాంటి పట్టింపు ఉండేది కాదని, ఎప్పుడూ నోటీసులు ఇచ్చిందే లేదని గుర్తు చేశారు.  కనీసం ఇప్పటికైనా నోటీసులు ఇవ్వడం ప్రారంభించారని అంటూ చురకలు అంటించారు. ఈ ప‌రిణామం ఆనంద‌దాయ‌కం  అని చెప్పారు.
అయితే  లఖింపూర్ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు  జరుగుతోందని, నివేదిక వచ్చాక  నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా గతంలో యుపిఎ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.  చిదంబ‌రం కేంద్ర హోంమంత్రిగా ఉన్న‌ప్పుడు 26/11 దాడుల‌ను ఎలా ఎదుర్కొన్నారో త‌మ‌కు బాగా తెలుస‌ని అంటూ ఎద్దేవా చేశారు. ఉగ్ర‌వాదాన్ని ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఎలా ఎదుర్కొంటోందో కూడా త‌మ‌కు తెలుస‌ని పేర్కొన్నారు. 
 
కాగా, అంతకు ముందు లోక్‌సభలో రాహుల్‌ ఇచ్చిన నోటీసులో  సిట్‌ నివేదిక వెలువడిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ  కేబినేట్‌లో కేంద్ర సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న అజరు మిశ్రాను పదవి నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. 
 
‘లఖింపూర్‌ ఖేరీలో రైతులపై జరిపిన దారుణ కాండ ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగింది, ఇది నిర్లక్ష్యపూరిత చర్య కాదని యుపి పోలీసుల సిట్‌ దర్యాప్తులో తేలింది’ అని రాహుల్‌ గుర్తు చేశారు. కాబట్టి.. అజరు మిశ్రాను హోం శాఖ సహాయ మంత్రి నుండి తొలగించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు.