అలిపిరి వద్ద దేవస్థానం చెంత ముగిసిన రైతుల పాదయాత్ర

అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలన్న ఆకాంక్షతో 44 రోజులపాటు అడ్డంకుల్ని అధిగమించి, అణచివేతల్ని భరించి.. వర్షంలో సైతం ముందుకు సాగుతూ.. అమరావతి రైతులు ఓ ఉద్యమంలా చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ మహా పాదయాత్ర తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల చెంత ముగిసింది. 

గరుడ విగ్రహానికి, టోల్‌గేట్‌ పాత ప్రవేశ ద్వారానికి నడుమ పాదయాత్ర రథం ముందు అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు శివారెడ్డి, తిరుపతి రావు, రాయపాటి శైలజ తదితరులు మోకాళ్లపై కూర్చుని వెంకటేశ్వర స్వామికి కొబ్బరి కాయలు కొట్టారు. ‘అమరావతి రక్షక గోవిందా’ అంటూ శ్రీవారి నామస్మరణలతో పాదయాత్ర ముగించారు. 

ఈ సందర్భంగా గోవింద నామస్మరణలతో అలిపిరి మార్మోగింది. యాత్రకు మద్దతు తెలుపుతూ ప్రజలు పెద్దఎత్తున కొబ్బరికాయలు కొట్టారు. ఆఖరి రోజైన మంగళవారం తిరునగరిలో పాదయాత్రకు జనం అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. రాజధాని రైతులను స్వాగతించేందుకు ప్రతి కూడలిలోనూ వేలాదిగా జనం పోటెత్తారు.

 తిరుపతి నగరంలో వీధివీధినా అమరావతి నినాదం మార్మోగింది. మద్దతుగా తరలివచ్చిన వేలాదిజనంతో కలసి అమరావతి రైతులు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి పాద క్షేత్రమైన అలిపిరికి చేరుకున్నారు. మధ్యాహ్న భోజనం కూడా చేయకుండా అమరావతి రైతులు పాదయాత్ర కొనసాగించారు.

తిరుపతి లక్ష్మీపురం కూడలిలో మూడు రాజధానులకు అనుకూలంగా తిరుపతి ప్రజల పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పాదయాత్రకు స్వాగతం పలికేందుకు వచ్చిన జనసేన నేతలు, కార్యకర్తలు చించివేశారు. దీంతో కొంతసేపు అలజడి నెలకొంది. కృష్ణాపురం ఠాణా వద్ద ఫ్లెక్సీలను తెలుగు యువత నాయకులు తొలగించారు. 

ఆ ఫ్లెక్సీలను నగరమంతా వైసీపీ నేతలు ఏర్పాటు చేయించినట్టు తెలుస్తోంది. వీటిని చించివేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.   ‘మీతో మాకు గొడవలద్దు. మీకుమా స్వాగతం. మూడు రాజధానులే కావాలి. ఇట్లు తిరుపతి ప్రజలు’ పేరుతో వైసిపి మద్దతుదారుల బ్యానర్లు సోమవారం రాత్రికి రాత్రే వెలిశాయి.

టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు తులసిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, సిపిఎం తిరుపతి ప్రాంత జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, జనసేన రాష్ట్ర నాయకులు పసుపులేటి హరిప్రసాద్‌, బిజెపి రాష్ట్ర నాయకులు భానుప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో వేర్వేరుగా పాదయాత్ర రైతులకు స్వాగతం పలికారు. 

అమరావతి నుంచి పాదయాత్రగా వచ్చిన మహిళలకు ఎమ్మెల్సీ దొరబాబు నేతృత్వంలో మంగళవారం సాయంత్రం రామానాయుడు కల్యాణ మండపంలో ‘సారె’ అందించి సత్కరించారు. శ్రీవారి దర్శనానికి అమరావతి రైతులకు ఎట్టకేలకు టిటిడి మంగళవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో, అమరావతి రైతులు బుధ, గురువారాల్లో స్వామివారిని దర్శించుకోనున్నారు.