ఏపీ సినిమా టికెట్ ధరల తగ్గింపు జిఓ కొట్టివేత

 సినిమా టిక్కెట్‌ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టిక్కెట్ల ధరలు తగ్గిస్తూ ఇచ్చిన జీవో నెం.35ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సస్పెండ్‌ చేసింది. పాత విధానంలో టిక్కెట్ల రేట్లు నిర్ణయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది.  దీంతో ఇక నుంచి రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో పాత రేట్లే అమల్లోకి వస్తాయి.
 
టిక్కెట్‌ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ థియేటర్‌ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఇచ్చిందని వివరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని, కొత్త సినిమాలు విడుదలైన సమయంలో టిక్కెట్‌ ధరలు పెంచుకునే హక్కు యజమానులకు ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు. 
 
దీనిపై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. సీనియర్‌ న్యాయవాదులు ఆదినారాయణ రావు, దుర్గా ప్రసాద్‌ పిటిషనర్ల తరుపున తమ వాదనలు వినిపించారు. టిక్కెట్‌ ధరలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని విన్నవించారు. పిటిషనర్‌ తరుపు న్యాయవాదులు చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 35ను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 
పవన్ కల్యాణ్ ‘వకీల్‌సాబ్‌’ సినిమా విడుదల సమయం నుంచి టికెట్‌ రేట్ల గురించి ఏపీ ప్రభుత్వానికి, సినిమా పరిశ్రమకు చర్చలు జరుగుతూ ఉన్నాయి. పలుమార్లు ఇదే విషయంపై చర్చించడానికి సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వం చుట్టూ తిరిగారు. ఏపీ మంత్రి పేర్ని నాని ఈ విషయంపై పలు సందర్భాల్లో ప్రెస్‌మీట్లు పెట్టి మరీ మాట్లాడారు. 
 
తాజాగా,  ఏపీలో సినిమా టికెట్ల ధరలు ఇలానే ఉండాలంటూ  టికెట్ ధరల పట్టికను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఆన్‌లైన్‌ వ్యవహారంపై సంతృప్తికరంగానే ఉన్న టాలీవుడ్ ప్రముఖులు టికెట్ల ధరల విషయంలోనే ఒక్కసారి ఆలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఈ విషయం కోర్టు వరకు వెళ్లడం జరిగింది. 
 
కోర్టు ఇచ్చిన తీర్పుతో రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాల నిర్మాతలే కాకుండా, పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రూ 100 కోట్లను మించి రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తున్న నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాకు  ఈ జిఓ కారణంగా ఏపీలో రూ 10 కోట్ల మేరకు ఆదాయం కోల్పోయిన్నట్లు సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.