ప్రజలపై విద్యుత్  చార్జీల భారం మోపనున్న జగన్ 

త్వరలో ఏపీ ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపేందుకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే స్లాబ్‌లో ఏపీ ప్రభుత్వం భారీ మార్పులు చేయనుంది. తొలి 30 యూనిట్‌లకే రూపాయి 45 పైసలు చొప్పున వసూలు చేయనుంది. 

ఇక 31 నుంచి 75 యూనిట్ల కైతే రెండు రూపాయల ఎనభై పైసలు, ఒకటి నుంచి 100 యూనిట్ల వరకు నాలుగు రూపాయలు, 101 నుంచి 200 యూనిట్లకు ఐదు రూపాయలు, 201 నుంచి 300 యూనిట్లకు ఏడు రూపాయలు, 300 యూనిట్లు పైబడితే యూనిట్‌కు ఏడు రూపాయలు యాభై పైసలు చొప్పున వసూలు చేయనుంది. 

రెవెన్యూ లోటు రూ 3685 కోట్లు పొంచి ఉన్న నేపథ్యంలో ట్రూ అప్ చార్జీల ముప్పు జనంపై పడనుంది. పేదలకు ఇస్తున్న సబ్సిడీలకు మంగళం పలకనున్నారు. ఈ మేరకు  డిస్కమ్‌లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌  నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్ సివి నాగార్జున రెడ్డికి ప్రతిపాదనలు అందించాయి. 

ఇప్పటి వరకూ ఎస్సీ ఎస్టీలకు నెలవారీ 50 యూనిట్ల దాకా ఉచితంగా కరెంటు ఇస్తున్నారు. తొలి 100 యూనిట్ల దాకా రూ.1.45కే యూనిట్‌ అందుతోంది. కానీ ఈ శ్లాబును 30 యూనిట్లకే పరిమితం చేసి.. 31 నుంచి 75 యూనిట్లలోపు వాడేవారికి రూ.2.80 పైసల చొప్పున వసూలుకు డిస్కమ్‌లు సిద్ధమయ్యాయి. 

100 యూనిట్లలోపు వినియోగదారులే అత్యధికంగా ఉంటారు. వీరి నుంచి యూనిట్‌కు ఏకంగా నాలుగు రూపాయల చొప్పున వసూలుచేయాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. వాణిజ్య అవసరాలకు సరఫరా చేసే సీ కేటగిరీలో మాత్రం ఎలాంటి మార్పులూ చేయలేదు.

మరోవంక, ఇటీవల ట్రూఅప్‌ చార్జీల వసూలును ఈఆర్‌సీ తాత్కాలికంగా నిలిపివేసినా.. త్వరలోనే వాటిని వినియోగదారుల నుంచి గుంజేందుకు డిస్కమ్‌లు సిద్ధంగా ఉన్నాయి. ట్రూఅప్‌ చార్జీల కింద రూ.3,121 కోట్లు, నెట్‌వర్క్‌ చార్జీల కింద రూ.3,670 కోట్లను వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు ఈఆర్‌సీ నుంచి ఇప్పటికే ఆమోదం పొందింది.