ఏపీ ఆర్థిక పరిస్థితి చేయి దాటి పోయింది

ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది.  పరిస్థితి చేయిదాటి పోయినదని స్వయంగా అధికార పార్టీ ఎంపీ పార్లమెంట్ లో ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఆదుకొంటే గాని ముందడుగు వేయలేమని నిస్సహాయత వ్యక్తం చేశారు. మరోవంక రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ లోపించడం వల్లనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారినదని కేంద్ర ఆర్ధిక మంత్రి  నిర్మలా సీతారామన్ రాజ్యసభలో స్పష్టం చేశారు.
 
ఏపీలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక సంక్షోభంపై నిర్మలా సీతారామన్‌ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఆమె పేర్కొన్నారు. మంగళవారం రాజ్యసభలో బీజేపీ సభ్యుడొకరు అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. 
 
2019-20లో రెవెన్యూ లోటు బడ్జెట్‌ అంచనాలకంటే పెరిగింద ఆమె తెలిపారురు. అమ్మఒడి, ఉచిత విద్యుత్‌ సరఫరా తదితర అనేక పథకాల వల్ల రెవెన్యూ లోటు అనూహ్యంగా పెరిగిపోతోందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.  రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయాలను వాస్తవికంగా అంచనా వేయడంలో వైఫల్యం చెందిందని ఆమె విమర్శించారు. 
 
రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోటు గ్రాంటుగా అందినప్పటికీ, రాష్ట్ర రెవెన్యూ లోటులో పెరుగుదల కొనసాగుతోందని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధుల పంపిణీ తర్వాత 2020-21లో  రెవెన్యూ లోటు అంచనా 5,897కోట్లు ఉండగా, వాస్తవిక రెవెన్యూ లోటు 34,926.80కోట్లకు పెరిగిందని ఆమె చెప్పారు. 
 
కాగ్‌ నివేదిక ఆధారంగా పన్నుల రూపంలో రాష్ట్రానికి  29,935.32కోట్లు, గ్రాంట్‌గా 57,930.62కోట్లు, రుణాల కింద 2వేల కోట్లు విడుదల చేశామని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం పన్నుల రూపంలో 77,398కోట్లు రెవెన్యూ వస్తుందని అంచనా వేయగా, 57,377.97కోట్లు మాత్రమే సమకూరిందని ఆమె తెలిపారు. పన్నులేతర రెవెన్యూ 5,267కోట్లు వస్తుందని అంచనా వేయగా 3,309.61కోట్లే వచ్చిందని ఆమె వివరించారు. 
 
 కాగా, లోక్‌సభలో అదనపు పద్దులపై జరిగిన చర్చలో మంగళవారం వైసీపీ  లోక్‌సభా పక్ష నేత  మిథున్‌రెడ్డి మాట్లాడుతూ  ‘‘రాష్ట్ర భవిష్యత్తుపై చాలా ఆందోళన చెందుతున్నాం. దీని నుంచి బయటపడే మార్గం కనిపించడంలేదు. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు సహకరించండి’’ అని కేంద్రాన్ని వేడుకున్నారు. 
 
తమ పట్ల సానుభూతి చూపించాలని కోరారు. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను  వివరించారు. ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం పార్లమెంటులో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ‘‘కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మా రాష్ట్రం ఆర్థిక భారాన్ని భరించే స్థాయి దాటిపోయింది’’ అని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కేంద్రమే సహకరించాలని కోరారు. 
 
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను పదేళ్లలో పూర్తి చేయాలని ఉందని, కానీ ఇప్పటికి దాదాపు 8 ఏళ్లు గడిచిపోయినా తగిన సహకారం అందడంలేదని తెలిపారు. చట్టంలోని అనేక హామీలను నెరవేర్చలేదని,    పోలవరం, రెవెన్యూ లోటు, పెట్రో కారిడార్‌, వెనుకబడిన జిల్లాలకు నిధుల వంటి అనేక అంశాలు ఉన్నాయని వివరించారు. 
 
పోలవరం ప్రాజెక్టు విషయంలో తొలుత కేంద్రం అనేక కొర్రీలు వేసిందని, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత కూడా తాగునీటి కంపోనెంట్‌కు నిధులు ఇవ్వబోమని చెప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టానికి గాను రూ.100 కోట్లు మధ్యంతర సాయంగా విడుదల చేయాలని, కేంద్ర బృందాన్ని పంపించి నష్టాన్ని అంచనా వేయాలని ప్రతిపాదించారు. 
మరోవంక, రోజురోజుకూ రాష్ట్రంలో లోటు పెరిగిపోతోంది. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువవుతుండటంతో ఆదాయ లోటుతో పాటు ద్రవ్య లోటు కూడా ఆందోళనకరంగా మారుతోంది. బడ్జెట్‌లో అంచనా వేసిన లోటుకు, ప్రస్తుత లోటుకు మధ్య అంతరం ఊహకు అందని విధంగా కనిపిస్తోంది. ఇది ఆందోళనకరమని ఆర్ధికశాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

తాజాగా సిద్ధం చేసిన గణాంకాల ప్రకారం ఆదాయ లోటు 40,828 కోట్లుగా ఉండగా, ద్రవ్య లోటు 49,756 కోట్లకు చేరుకుంది. వాస్తవానికి అయితే బడ్జెట్‌లో ఆదాయ లోటును రూ. 5 వేల కోట్లుగా, ద్రవ్యలోటును రూ. 37 వేల కోట్లుగా అంచనాలు రూపొందించారు. ఇందుకు భిన్నంగా ఆదాయ లోటు రూ. 35 వేల కోట్లు అదనంగా నమోదవ్వగా, ద్రవ్యలోటు కూడా అదనంగా 12,700 కోట్లకు పెరిగింది. ఇది అసాధారణ పెరుగుదలగానే అధికారులు అభిప్రాయపడుతున్నారు.