పెట్రోల్ పై మూడేళ్లలో రూ 8 లక్షల కోట్ల ఆదాయం

గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో పెట్రోల్‌, డీజిల్‌పై విధించిన పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.8.02 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలోనే పన్నుల ద్వారా రూ.3.71 లక్షల కోట్లను కేంద్రం తన ఖజానాలో వేసుకుంది.

 రాజ్యసభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌  ఈ విషయం వెల్లడించారు. గత మూడేండ్లలో పెట్రోల్‌, డీజిల్‌పై విధించిన ఎక్సైజ్‌ డ్యూటీ వివరాలు, చమురుపై విధించిన పన్నులు, సమకూరిన ఆదాయం లెక్కలు తెలియజేయాలంటూ సభ్యులు అడిగిన ప్రశ్నకు నిర్మలాసీతారామన్‌ రాతపూర్వకంగా ఈ వివరణ ఇచ్చారు.

ఇలా ఉండగా, గత ఐదేండ్ల కాలంలో విదేశీ ఖాతాల్లో నల్లధనం ఎంత ఉందో అనేదానిపై అధికారికంగా ఎలాంటి అంచనా వేయలేదని కేంద్ర ప్రభుత్వం  పార్లమెంట్‌కు తెలిపింది. నల్లధనం స్వచ్ఛందంగా ప్రకటించేందుకు 2015లో కేంద్రం ఇచ్చిన మూడు నెలల గడువులో 648 మంది రూ.4,164 కోట్ల నల్లధనం వెల్లడించారని , దీనిపై పన్నులు, పెనాల్టీల రూపంలో రూ.2,476 కోట్లు వసూలు చేసినట్టు వెల్లడించింది.

3 దశాబ్దాల గరిష్ఠానికి టోకు ధరలు

కాగా,  దేశంలో టోకు ధరలు గత మూడు దశాబ్దా ల్లో ఎన్నడూ లేనం త వేగంగా పెరిగాయి. ఈ నవంబర్‌ నెలలో టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) ఏకంగా 14.23 శాతం ఎగసింది. 1991 డిసెంబర్‌లో నమోదైన 14.30 శాతం తర్వాత ఇదే అత్యధికం. 2020 నవంబర్‌లో ఇది 2.29 శాతమే. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇది 12.54 శాతంగా ఉంది. 

లోహాలు, క్రూడ్‌ పెట్రోలియం, సహజవాయువు, రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, ఆహారోత్పత్తుల ధరలు 2020 నవంబర్‌తో పోలిస్తే తాజాగా ముగిసిన నెలలో బాగా పెరగడంతో టోకు ద్రవ్యోల్బణం అధికంగా నమోదయ్యిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ  విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 

ముఖ్యంగా ఇంధనం, విద్యుత్తు ధరలు 2020 నవంబర్‌కంటే ఈ దఫా 40 శాతం పెరగడం అధిక ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణమని వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు, ఇంధన ధరలు గరిష్ఠస్థాయికి చేరినందున, ప్రపంచమంతటా ద్రవ్యోల్బణం పెరుగుతున్నదని పేర్కొన్నారు. కనిష్ఠ ద్రవ్యోల్బణం రేటును నమోదుచేసే అమెరికాలో కూడా రికార్డుస్థాయికి చేరిందని తెలిపారు.