ప్రభుత్వ రంగ పరిశ్రమలలో  రూ 2.12 లక్షల కోట్ల ఆదాయం 

గత పదేళ్లలో కేంద్ర పభుత్వ రంగ పరిశ్రమల నిర్వహణతో రూ.2,12,40,915 కోట్ల ఆదాయం వచ్చినట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్‌ కిషన్‌రావు కరడ్‌ వెల్లడించాయిరు. వైసిపి ఎంపి వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత పదేళ్లలో జాయింట్‌ స్టాక్‌, ప్రభుత్వ కంపెనీలలో ప్రభుత్వం రూ.3,69,188.87 కోట్లు పెట్టుబడి పెట్టిందని కూడా మంత్రి తెలిపారు.

కాగా, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమ (సిపిఎస్‌ఇ)ల్లో రూ.3,62,766 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నట్లు  మంత్రి భగవత్‌ కిషన్‌రావు కరడ్‌ లోక్‌సభలో పేర్కొన్నారు.  2014-15 నుంచి 2020-21 వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మొత్తం రూ.3,62,766 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.

2020-21లో డిజిన్వెస్ట్‌మెంట్‌ రసీదుల కోసం సవరించిన అంచనా రూ.32,000 కోట్లు కాగా, 31 మార్చి 2021 నాటికి ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ రశీదు రూ.32,845 కోట్లుగా ఉంది.

రూ.2.85 లక్షల కోట్లు ఎగ్గొట్టిన కార్పొరేట్లు


ఇలా ఉండగా,  దేశంలోని పలు కార్పొరేట్‌ కంపెనీలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ (పిఎస్‌బి)ల నుంచి తీసుకున్న లక్షల కోట్ల అప్పులు చెల్లించకుండా ఎగ్గొట్టాయి. కేవలం 13 మంది కార్పొరేట్లు దాదాపు రూ.2.85 లక్షల కోట్లు ఎగ్గొట్టారని బ్యాంకు ఉద్యోగుల సంఘం నేతలు ఆరోపించారు. 

దేశంలోని 13 బడా పారిశ్రామికవేత్తలు బ్యాంక్‌లకు రూ.4,86,800 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా, ఇందులో కేవలం రూ.1,61,820 కోట్లు మాత్రమే చెల్లించి, మిగతాది ఎగ్గొట్టారని బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం నేత ఒకరు తెలిపారు. కాగా, గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో పిఎస్‌బిలు రూ.1.97 లక్షల కోట్ల నిర్వహణ లాభాలు సాధించాయని పేర్కొన్నారు.