పినాకా-ఈఆర్ రాకెట్ పరీక్ష విజయవంతం

పినాకా రాకెట్ వ్య‌వ‌స్థ‌కు చెందిన ఎక్స్‌టెండెడ్ రేంజ్‌ను శనివారం  విజ‌య‌వంతంగా ప‌రీక్షించారు. ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ ఈ విష‌యాన్ని తెలిపింది. మూడు రోజుల నుంచి ద‌శ‌ల‌ వారీగా విజ‌య‌వంతంగా టెస్టింగ్ సాగుతోంది. పోక్రాన్ ఫీల్డ్ రేంజ్‌లో ఈ టెస్టింగ్ జ‌రిగింది. 
 
డీఆర్డీవో టెక్నాల‌జీ సాయంతో ప్రైవేటు ఇండ‌స్ట్రీ ఆ రాకెట్ వ్య‌వ‌స్థ‌ను డెవ‌ల‌ప్ చేసింది. వివిధ ర‌కాల సామ‌ర్ధ్యం ఉన్న‌ వార్‌హెడ్స్ తో పినాకా రాకెట్ల‌ను ప‌రీక్షించామ‌ని, అన్ని ట్ర‌య‌ల్స్‌లోనూ సంతృప్తిక‌రంగా ఫ‌లితాలు వ‌చ్చిన‌ట్లు ర‌క్ష‌ణ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 
 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న పినాక పరిధిని పెంచి పినాక-ఈఆర్‌గా తీర్చిదిద్దారు. ఇవి గత దశాబ్దకాలంగా ఆర్మీ అమ్ములపొదిలో ఉన్నాయి. ప్రస్తుతం వీటి పరిధి 45 కిలోమీటర్లు కాగా, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి పరిధిని 70 కిలోమీటర్లకు పెంచారు.
 
పినాక అనేది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థంగా పనిచేసే బహుళ బ్యారెల్ రాకెట్ వ్యవస్థ. ఇది శత్రు సైన్యంపై 44 సెకన్లలో 72 రాకెట్లను ప్రయోగించగలదు.  ఇక పినాకా-ఈఆర్ రేంజ్‌ను మాత్రం ఇంకా వెల్ల‌డించ‌లేదు. అయితే వివిధ రేంజ్‌ల్లో ఉన్న టార్గెట్ల‌పై 24 రాకెట్ల‌ను ప‌రీక్షించిన‌ట్లు తెలిపారు.
గతేడాది మేలో లడఖ్ వద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పుడు చైనా సరిహద్దులో పినాక రాకెట్ వ్యవస్థను మోహరించారు. డీఆర్‌డీవో-అర్మామెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏఆర్‌డీఈ), పూణె, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లేబరేటర (హెచ్‌ఈఎంఆర్ఎల్) పూణె కలిసి సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి.
 
యాంటీ ట్యాంక్ క్షిపణి ప్రయోగం
 
మరోవంక, దేశీంగా రూపొందించి అభివృద్ధి చేసిన హెలికాప్టర్ లాంచ్ స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్  క్షిపణిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భారత వాయుసేన (ఐఏఎఫ్‌) సంయుక్తంగా శనివారం పరీక్షించాయి. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ రేంజ్‌లో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. 
 
10 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను నిర్వీర్యం చేసే సామర్థ్యమున్న భారీ విధ్వంసక యాంటీ ట్యాంక్ క్షిపణిని ఐఏఎఫ్‌ హెలికాప్టర్‌ నుంచి ప్రయోగించి పరీక్షించారు. మిషన్ లక్ష్యాలన్నింటినీ ఇది సాధించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ మిషన్‌ బృందాన్ని అభినందించారు.  ఈ ప్రయోగానికి సంబంధించిన స్లో మోషన్‌ వీడియోను డీఆర్డీవో విడుదల చేసింది.