కరోనా అధికంగా ఉంటె రాత్రిపూట కర్ఫ్యూ… కేంద్రం సూచన

ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కరోనా  నిబంధనలపై నిర్లక్ష్యంగా ఉండోద్దని హెచ్చరించింది. అధిక కరోనా పాజిటివిటీ ఉన్న ప్రాంతాల్లో అవసరమైతే రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయాలని సూచించింది. 
 
ఈ మేరకు అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, అడ్మినిస్ట్రేటర్స్‌కు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ లేఖ రాశారు. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత 2 వారాల నుంచి అధిక కరోనా  పాజిటివిటీ రేటు నమోదవుతుందని, ఈ ప్రాంతాలను చాలా దగ్గరగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. 
 
దేశవ్యాప్తంగా రోజువారీ కేసులు భారీగా తగ్గుతున్నా, మహ్మమారికి వ్యతిరేకంగా పోరాటంలో దేశం ఇంకా విమర్శనాత్మంగా ఉందని లేఖలో రాజేష్‌ భూషణ్‌ హెచ్చరించారు. మూడు రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాల్లో రెండు వారాల నుంచి 10 శాతానికి పైగా పాజిటివిటీ రేటు నమోదవుతుందని చెప్పారు. 
 
అదే విధంగా,  ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో రెండు వారాల నుంచి పాజిటివిటీ రేటు 5 శాతం నుంచి 10 శాతం వరకూ నమోదవుతుందని చెప్పారు. ఈ 27 జిల్లాలను దగ్గరగా పర్యవేక్షించాల్సి అవసరం ఉందని లేఖలో ఆయన తెలిపారు.
 
‘ఏ జిల్లాలోనైనా పాజిటివిటీ రేటు పెరిగినట్లు కనిపిస్తే వెంటనే అక్కడి స్థానిక యంత్రాంగం వ్యూహాత్మక చర్యలు ప్రారంభించాలి. ఈ ప్రాంతాల్లో పరీక్షలు, వ్యాక్సినేషన్‌ పెంచాలి. కంటైన్మెంట్‌ జోన్లుగా పరిగణించి, అవసరమైతే రాత్రిపూట  కర్ఫ్యూ విధించాలి’  అని సూచించారు.  జనసమూహాలు, పెళ్లిళ్లు జన సమూహాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గొనే వారిపై పరిమితులు విధించాలని రాజేష్‌ భూషణ్‌ స్పష్టం చేశారు. 

ఇలా ఉండగా, దేశంలో కొత్తగా 7774 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,90,510కి చేరింది. ఇందులో 3,41,22,795 మంది కరోనా నుంచి కోలుకోగా, 92,281 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,75,434 మంది మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కొత్తగా 306 మంది మరణించగా, 8464 మంది కోలుకున్నారని తెలిపింది.

దేశంలో యాక్టివ్‌ కేసులు 560 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని పేర్కొంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.27 శాతమని వెల్లడించింది. 2020 మార్చి తర్వాత కరోనా రికవరీ రేటు గరిష్ఠానికి చేరిందని, ప్రస్తుతం 98.36 శాతంగా ఉందని తెలిపింది. ఇక శనివారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా 1,32,93,84,230 మందికి కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.