బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌ అనుమతించం

బహిరంగ ప్రదేశాల్లో ముస్లింలు నమాజ్‌ చేయడాన్ని అనుమతిపబోమని హర్యానా ముఖ్యమంత్రి  మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ స్పష్టం చేశారు. గుర్గావ్‌లో బహిరంగ ప్రదేశాల్లో ముస్లింలు ప్రార్థనలు చేయడంపై అనేక హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేశాయి. 
 
వీటిపై స్పందించిన ఖట్టర్‌ బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌ చేయడం సరికాదని తేల్చి చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు నిర్వహించడానికి కొన్ని స్థలాలను రిజర్వ్‌ చేయాలనే జిల్లా యంత్రాంగం నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నామని తెలిపారు. 
 
కాగా, గుర్గావ్‌లో ముస్లింలు బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌ చేయడాన్ని హిందూ సంఘాల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల నమాజ్‌ చేసుకునేందుకు 37 ప్రత్యేక స్థలాలను ప్రభుత్వం కేటాయించడంపై హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాయి. 
 
ఈ ఫిర్యాదుపై మీడియా సమావేశంలో పాల్గన్న ఖట్టర్‌ను ప్రశ్నించగా  ‘బహిరంగ ప్రదేశాలలో(గుర్గావ్‌) నమాజ్‌ చేసుకోవడాన్ని అనుమతించే ప్రసక్తే లేదు. అయితే సామరస్యపూర్వకమైన పరిష్కారం కోసం చర్చిస్తాం. ప్రతి ఒక్కరూ తమ తమ విశ్వాసాల ప్రకారం ప్రార్థనలు చేసుకోవచ్చు’ అని తెలిపారు. 
 
అయితే ఇతరులను ఇబ్బందులకు గురిచేసి, వారి హక్కులు ఉల్లంఘించడం సరికాదని హితవు చెప్పారు. అటువంటి చర్యలను  ఊపేక్షించబోమని కూడా అని ఖట్టర్‌ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో.. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు చేసేందుకు కొన్ని స్థలాలను కేటాయించాలన్న జిల్లా యంత్రాంగం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంపైనా ఆయన స్పందించారు.
 
 ‘ఈ సమస్యను పరిష్కరించాలని పోలీసులకు, డిప్యూటీ కమిషనర్‌కు చెప్పాం. ఎవరైనా ఒకే చోట నమాజ్‌ చేస్తే అభ్యంతరం లేదన్నారు. ప్రార్థనలు చేసేందుకు మత పరమైన ప్రార్థనా స్థలాలు నిర్మించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు చేయకూడదు’ అని ముఖ్యమంత్రి తెలిపారు. 
 
బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు చేయడం ద్వారా ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ అలాంటి ఘర్షణలను తాము అస్సలు సహించం అని ఖట్టర్‌ స్పష్టం చేశారు.