బిపిన్ రావ‌త్‌ను కోల్పోవ‌డం ప్ర‌తి దేశ‌భ‌క్తుడికి న‌ష్ట‌మే

బిపిన్ రావ‌త్‌ను కోల్పోవ‌డం ప్ర‌తి దేశ‌భ‌క్తుడికి న‌ష్ట‌మే
సీడీఎస్ చీఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌ను కోల్పోవ‌డం ప్ర‌తి దేశ‌భ‌క్తుడికి న‌ష్ట‌మే అంటూ డిసెంబ‌ర్ 8వ తేదీన జ‌రిగిన ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతిచెందిన వీర సైనికుల కుటుంబాల‌కు ప్ర‌ధాని నరేంద్ర మోదీ మరోమారు సంతాపం తెలిపారు. 
 
ఉత్తర ప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో రూ.9,800 కోట్ల విలువైన సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ  రావ‌త్ అత్యంత ధైర్య‌సాహాసాలు క‌లిగిన వ్య‌క్తి అని, దేశ సైన్యాన్ని స్వ‌యంవృద్ధి చేసేందుకు ఎంతో కృషి చేశార‌ని కొనియాడారు. 
 
ఆయ‌న ప‌నితీరును దేశం ప్ర‌త్య‌క్షంగా చూసింద‌ని చెబుతూ సైన్యంలో ఉన్నంత కాల‌మే ఓ సైనికుడు కేవ‌లం సైనికుడిలా ఉండిపోర‌ని, వారి జీవితం అంతా యోధులుగా ఉంటార‌ని, త‌న రంగానికి క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగి ఉంటార‌ని, ఇది దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు.  
 
త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని పటిష్టపరిచేందుకు ఆయన చేసిన కృషి కొనసాగుతుందని, కొత్త నిర్ణయాలతో భారత్ ముందుకెళ్ళడాన్ని ఆయన ఎక్కడ ఉన్నా చూస్తారని భరోసా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఆయన ఎక్కడ ఉన్నా భారత దేశం దృఢ నిశ్చయంతో ముందుకెళ్తుండటాన్ని చూస్తారని తెలిపారు.
భారత దేశం విచారంలో ఉన్నప్పటికీ, వేగాన్ని, అభివృద్ధిని ఆపేది లేదని చెప్పారు. భారత దేశం స్తంభించిపోదని స్పష్టం చేశారు. భారతీయులమంతా కలిసికట్టుగా పని చేస్తామని, దేశంలోపల, వెలుపల ఎదురయ్యే ప్రతి సవాలును ఎదుర్కొంటామని ప్రధాని తెలిపారు.
దేశాన్ని మ‌రింత శ‌క్తివ‌తంగా, మ‌రింత స‌స్య‌శ్యామ‌లంగా మారుస్తామ‌ని పేర్కొన్నారు.
గ్రూప్ కెప్టెన్ వ‌రున్ సింగ్ ప్రాణాన్ని కాపాడేందుకు డాక్ట‌ర్లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, ఆయ‌న క్షేమంగా ఉండాల‌ని మాతా ప‌టేశ్వ‌రిని ప్రార్థిస్తున్నార‌ని చెప్పారు. దేశ‌మంతా ఆ కుటుంబానికి అండ‌గా ఉంటుంద‌ని, ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనిక కుటుంబాల‌కు మ‌ద్ద‌తుగా దేశం నిలుస్తోంద‌ని ప్ర‌ధాని తెలిపారు.
 
అయోధ్య‌లో రామాల‌యం గురించి ప్ర‌స్తావ‌న చేస్తే మ‌హారాజా ప‌టేశ్వ‌రి ప్ర‌సాద్ సింగ్ సాహెబ్ గుర్తు వ‌స్తార‌ని చెప్పారు.  బ‌ల‌రామ్‌పూర్ ప్ర‌జ‌లు మేధావుల‌ని, దేశానికి ఈ ప్రాంతం వాళ్లు ఇద్ద‌రు భార‌త ర‌త్నాల‌ను ఇచ్చిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. నానాజీ దేశ్‌ముఖ్‌తో పాటు అట‌ల్ బిహారీ వాజ్‌పేయి ఈ ప్రాంతం వాళ్లే అని గుర్తు చేశారు.