గురుగ్రంథ్ సాహిబ్ లను మోసిన జేపీ నడ్డా

సిక్కు మత పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్ లతో కాబుల్ నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న సిఖ్ ప్రతినిధులకు కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా స్వాగతం పలికారు.  విమానం దగ్గరకు వెళ్లి గురుగ్రంథ్ సాహిబ్ లను ఎయిర్ పోర్ట్ లోని ఓ ఛాంబర్ వరకు మోసుకొచ్చారు. 
 
తాలిబన్‌ ఆధీనంలోని ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి తాజాగా మరో విమానం దేశానికి చేరింది. ఆపరేషన్ దేవి శక్తి మిషన్‌లో భాగంగా 104 మంది ప్రజలతోపాటు సిక్కు మతానికి చెందిన పురాతన పవిత్ర గ్రంథాలను కాబూల్‌ నుంచి భారత్‌కు తరలించారు.104 మందిలో పది మంది భారతీయులు కాగా, 94 మంది ఆఫ్ఘన్‌ జాతీయులు. 
 
‘ఆపరేషన్ దేవి శక్తి కింద, భారతదేశం ఏర్పాటు చేసిన ప్రత్యేక కామ్ ఎయిర్ విమానం కాబూల్ నుండి న్యూఢిల్లీకి శుక్రవారం చేరుకుంది. ఆఫ్ఘన్ హిందూ-సిక్కు మైనారిటీ కమ్యూనిటీ సభ్యులతో సహా 10 మంది భారతీయులను, 94 మంది ఆఫ్ఘన్‌లను తీసుకువచ్చింది. తరలించిన వారిలో ముగ్గురు పసిబిడ్డలతో సహా 9 మంది చిన్నారులు ఉన్నారు’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
 
ఆఫ్ఘనిస్థాన్‌లోని చారిత్రక గురుద్వారాల నుంచి మూడు శ్రీ గురు గ్రంథ్ సాహిబ్, కాబూల్‌లోని పురాతన 5వ శతాబ్దపు అసమై మందిర్ నుంచి రామాయణం, మహాభారతం, భగవద్గీతతో సహా హిందూ మత గ్రంథాలను కూడా అదే విమానంలో భారత్‌కు శుక్రవారం తీసుకువచ్చారు.మహావీర్ నగర్‌లోని గురు అర్జన్ దేవ్ జీ గురుద్వారాలో గరుగ్రంథ సాహిబ్‌లను ఉంచుతారు. ఫరీదాబాద్‌లోని అసమాయి మందిర్‌లో హిందూ గ్రంథాలను భద్రపరచనున్నారు.