బాంబే హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన మంత్రి మాలిక్‌

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌, బాంబే హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారి సమీర్ వాంఖడే కుటుంబంపై విమర్శలు చేయబోమన్న హామీని ఉల్లంఘించినందుకు హైకోర్టుకు శుక్రవారం బేషరతుగా క్షమాపణలు తెలిపారు. 

ఈ మేరకు నాలుగు పేజీల అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించారు. ఇంటర్వ్యూలలో జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు కోర్టుకు గతంలో తాను ఇచ్చిన హామీ కిందకు రావని భావించానని అందులో పేర్కొన్నారు. 

‘నవంబర్ 25, 29 నాటి ఉత్తర్వులలో నమోదు చేసినట్లుగా కోర్టుకు ఇచ్చిన నా హామీని ఉల్లంఘించినందుకు నేను ఈ గౌరవనీయమైన కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను’ అని నవాబ్ మాలిక్ తన అఫిడవిట్‌లో తెలిపారు.

ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే, ఆయన కుటుంబ సభ్యులపై మంత్రి నవాబ్ మాలిక్‌ చేసిన విమర్శలను వ్యతిరేకిస్తూ సమీర్‌ తండ్రి ధ్యాన్‌దేవ్ వాంఖడే ఆయనపై పరువునష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో వాంఖడే, ఆయన కుటుంబ సభ్యుల పరువునకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయబోనని నవంబర్‌ 25న, 29న కోర్టుకు హామీ ఇచ్చారు.

అయితే, సమీర్‌ వాంఖడే కుటుంబంపై మంత్రి మాలిక్‌ మళ్లీ విమర్శలు చేశారు. దీంతో ఇచ్చిన హామీని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన ఆయనపై ధిక్కార చర్యలు ఎందుకు చేపట్టకూడదు అని ప్రశ్నిస్తూ బాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం నోటీసు జారీ చేసింది. దీనికి స్పందించిన మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఈ మేరకు కోర్టుకు క్షమాపణలను అఫిడవిట్‌ ద్వారా తెలియజేశారు.