ఆశ్రు నాయ‌నాల మ‌ధ్య అంతిమ వీడ్కోలు

దేశ‌భ‌క్తి.. దేశ‌సేవ‌.. ఆయ‌న ఆలోచ‌న‌. సైన్యం ఆధునీక‌ర‌ణ ఆయ‌న ఆశ‌యం. క‌ర్త‌వ నిర్వ‌హ‌ణ‌లోనే ఆయ‌న చివ‌ర‌కు క‌న్నుమూసిన‌ సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్‌కు ఆశ్రు నాయ‌నాల మ‌ధ్య ఇవాళ అంతిమ వీడ్కోలు ప‌లికారు. భార‌త ఆర్మీని ప్రొఫెష‌న్ ఆర్మీగా తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నించిన రావ‌త్‌కు విష‌న్న‌వ‌ద‌నాల‌తో వీడ్కోలు ప‌లికారు. 

ర‌ణ‌నీతిలో త‌న అన‌న్య‌సామాన్య కౌశ‌లాన్ని ప్ర‌ద‌ర్శించిన బిపిన్ ఎప్ప‌టికీ గుర్తుండిపోతారు. కేవ‌లం సైన్యాధికారి రూపంలో మాత్ర‌మే కాదు.. వ్య‌క్తి రూపంలో ఆయ‌న అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నారు. దేశ‌భ‌క్తి, ప‌రాక్ర‌మం, వీర‌త్వం, సాహ‌స గుణాల‌తో అంద‌ర్నీ మెప్పించారు. అజేయ యోధుడిగా అమ‌రుడ‌య్యారు. 

దేశానికి ప్రేర‌కుడిగా నిలిచిన జ‌న‌ర‌ల్ రావ‌త్‌కు ఇవాళ ఢిల్లీలోని బార‌ర్ స్క్వేర్‌లో ఘ‌నంగా సైనిక రీతిలో అంతిమ సంస్కారాలు నిర్వ‌హించారు. సైనిక లాంఛ‌నాల‌తో అంతిమ సంస్కారాలు చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో 17 గ‌న్ సెల్యూట్ చేశారు. అంత‌క‌ముందు ఆయ‌న ఆత్మ‌కుశాంతి చేకూర్చాల‌ని విదేశీ అంబాసిడ‌ర్లు, ఆర్మీ నాయ‌కులు ప్రార్థించారు. పుష్ప గుచ్ఛాలు అర్పించారు.

శ్రీలంక‌, భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌లు హాజ‌ర‌య్యారు. 800 మంది త్రివిధ ద‌ళాల సైనికులు అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు. రావ‌త్ దంప‌తుల ద‌హ‌న సంస్కారాల‌కు భారీ సంఖ్య‌లో విదేశీ అతిథులు హాజ‌ర‌య్యారు. హిందూ వైదిక ధ‌ర్మం ప్ర‌కారం అంతిమ సంస్కారాలు నిర్వ‌హించారు.  రావ‌త్ ఇద్ద‌రు కుమార్తెలు కృతిక‌, త‌ర‌ణిలు ఆ పూజ‌ల్లో పాల్గొన్నారు.

బిపిన్‌ రావ‌త్, మ‌ధులికా రావ‌త్‌ దంప‌తుల పార్డీవ‌దేహాల‌ను ఒకే చితిపై పెట్టారు. సాంప్ర‌దాయం ప్ర‌కారం రావ‌త్ కుమార్తెలు ద‌హ‌న ధ‌ర్మాలు చేప్ట‌టారు. ఇద్ద‌రు కుమార్తెలు రావ‌త్ దంప‌తుల చితికి నిప్పు అంటించారు. బుధ‌వారం జ‌రిగిన ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో బిపిన్ రావ‌త్ దంప‌తులు మృతి చెందిన విష‌యం తెలిసిందే.

మ‌హాసైన్య నాయ‌కుడికి మ‌హానివాళి

మ‌హాసైన్య నాయ‌కుడు.. కొత్త శ‌క్తి.. కొత్త మార్గాన్ని ఇచ్చిన బ‌హ‌దూర్ బిపిన్ రావ‌త్‌కు ఇవాళ ఘ‌న నివాళి ప‌లికారు. ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ చీఫ్ రావ‌త్ దంప‌త‌లుకు ఇవాళ సైనిక లాంఛ‌నాల‌తో అంతిమ వీడ్కోలు నిర్వ‌హించారు. బ‌రార్‌ స్క్వేర్ శ్మ‌శాన‌వాటిక‌లో ప‌లువురు రావ‌త్ భౌతిక‌కాయానికి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. 

శ్రీలంక ఆర్మీ క‌మాండ‌ర్ జ‌న‌ర‌ల్ శ‌వేంద్ర సిల్వా, రాయ‌ల్ భూటాన్ ఆర్మీ డిప్యూటీ ఆఫీస‌ర్ బ్రిగేడియ‌ర్ దోర్జీ రింన్‌చెన్‌, నేపాల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ బాల్ కృష్ణ కార్కి, బంగ్లాదేశ్ ఆర్మ‌డ్ ఫోర్సెస్ డివిజ‌న్ ఆఫీస‌ర్ లెఫ్టినెంట్ వాక‌ర్ ఉజ్ జ‌మాన్‌లు రావ‌త్ దంప‌తుల పార్దీవ‌దేహాల‌కు పుష్ప నివాళి అర్పించారు.

బ్రిటీష‌న్ హై క‌మీష‌న‌ర్ అలెక్స్ ఎల్లిస్ కూడా పుష్ప నివాళి అర్పించారు. రావ‌త్ మృతి ప‌ట్ల ఆయ‌న తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. జాయింట్ డిఫెన్స్ విధానాన్ని రావ‌త్ ప్రారంభించార‌ని, దాన్ని తాము ఫాలో అవుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. గొప్ప నేత‌ను, సైనికుడిని ఇండియా కోల్పోయింద‌ని పేర్కొన్నారు. 

ఫ్రాన్స్ అంబాసిడ‌ర్ ఎమ్మాన్యువెల్ లినాయిన్ కూడా రావ‌త్ దంప‌తుల‌కు పుష్పాంజ‌లి ఘ‌టించారు. రావ‌త్ గొప్ప సైనిక నేత అని ఆయ‌న అన్నారు. బ‌రార్‌ స్క్వేర్ శ్మ‌శాన‌వాటిక‌లో ..కొంత సేపు రావ‌త్ దంప‌తులు శ‌వ‌పేటిక‌ను శ్ర‌ద్ధాంజ‌లి కోసం ఉంచారు. బిపిన్ శ‌వ‌పేటిక‌ను జాతీయ జెండాతో క‌ప్పారు.

తెలిసీ, తెలియని ఊహాగానాలొద్దు

 
 తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై సమాచారం లేని ఊహాగానాలు చేయవద్దని భారతీయ వాయు సేన (ఐఏఎఫ్) కోరింది. విచారణ వేగంగానే పూర్తవుతుందని, వాస్తవాలు బయటికి వస్తాయని శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో తెలిపింది. డిసెంబరు 8న జరిగిన ఈ ప్రమాదంపై త్రివిధ దళాల కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. యథార్థాలు బయటపడే వరకు సమాచారం లేని ఊహాగానాలు చేయవద్దని కోరింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి గౌరవ, మర్యాదలను కాపాడాలని కోరింది.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఈ ప్రమాదంలో దివంగతులు కావడంతో ఇది విద్రోహ చర్య అయి ఉంటుందనే అనుమానాలను అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మనసుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని శివసేన నేత సంజయ్ రౌత్ గురువారం చెప్పారు. చైనా, పాకిస్థాన్‌లకు దీటుగా బదులివ్వడంలో జనరల్ రావత్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. 

ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పార్లమెంటుకు తెలిపారు. మార్షల్ మానవేంద్ర సింగ్ (భారత వాయు సేన (ఐఏఎఫ్) ట్రైనింగ్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్) నేతృత్వంలో ఈ దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.