తొమ్మిది నెలల తర్వాత బూస్టర్ డోస్‌

తొలి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యాక తొమ్మిది నెలల తర్వాత బూస్టర్ డోస్‌ వేసుకోవచ్చని ఈ రిపోర్టులో పేర్కొందిఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ (ఐసీఎంఆర్‌‌) సూచించింది. ఆ మేరకు భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ బూస్టర్‌‌ డోసు వేయడంపై అవలంబించాల్సిన విధానంపై తమ అధ్యయన నివేదికను పార్లమెంటరీ కమిటీకి అందజేసింది.

డెల్టా తర్వాత వచ్చే వేరియంట్స్‌ను ఎదుర్కోవడంతో పాటు వ్యాధి తీవ్రతను, మరణాలను తగ్గించేందుకు కొవిషీల్డ్ మూడో డోసు వేయడం మంచిదని తమ అధ్యయనంలో తేలినట్లు ఆ నిపుణుల బృందంలోని ఒకరు తెలిపారు. కరోనా కొత్త వేరియంట్లను మరింత సమర్థంగా ఎదుర్కొనే శక్తిని బూస్టర్ డోస్ ఇస్తుందని అందులో పేర్కొన్నాయి. 

ఇప్పటికే ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ ఓ ప్రెస్‌మీట్‌లో బూస్టర్ డోస్ అవసరాన్ని ప్రస్తావించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు, ఆరోగ్య వ్యవస్థపై ఒక్కసారిగా భారం పడకుండా చూసేందుకు బూస్టర్ డోస్ సాయపడుతుందని చెప్పారు. 

కాగా, దక్షిణాఫ్రికాలో గుర్తించిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే దాదాపు 60 దేశాలకు వ్యాప్తి చెందింది. ఈ వేరియంట్ డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని, రోగ నిరోధక శక్తిని ఛేదించి వైరస్ అంటుకునే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించిన నేపథ్యంలో మన దేశంలో బూస్టర్ డోస్ వేయడంపై చర్చ మొదలైంది. 

ఎక్స్‌పర్ట్‌ కమిటీ నివేదిక ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఇది వరకే కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా ఐసీఎంఆర్ నివేదిక సిద్ధమైనందున త్వరలోనే మూడో డోసుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

త్వరలో దేశంలో 100 శాతం టీకాలు 

దేశంలోని 86 శాతానికి పైగా ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారని, సాధ్యమైనంత త్వరలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుకుంటోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ తెలిపారు. అర్హులైన 47.91 కోట్ల మంది (51 శాతం) వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని చెప్పారు. 

లోక్‌సభలో అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చక్కగా సాగుతోందని  చెప్పారు. ఏడు కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు ఆయా రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ఎవరూ వెనుకాడవద్దని కోరారు.

భారత్ సర్టిఫికేట్‌కు 108 దేశాల గుర్తింపు

ఇలా ఉండగా,  భారత దేశం జారీ చేసే కరోనా  వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌కు 100కుపైగా దేశాల గుర్తింపు లభించిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ లోక్‌సభకు చెప్పారు. డిసెంబరు 6 వరకు అందిన సమాచారం ప్రకారం 108 దేశాలు ప్రయాణాల కోసం ఈ ధ్రువపత్రాన్ని గుర్తిస్తున్నట్లు తెలిపారు.

వ్యాక్సిన్ల వినియోగానికి ఆమోదం తెలిపే విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ‌కు చెందిన ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ సహాయపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రొక్యూర్‌మెంట్ ఏజెన్సీలు, సభ్య దేశాలకు ఈ సహకారం లభిస్తుందని తెలిపారు. 

టీకాల నాణ్యత, భద్రత, సమర్థత, పనితీరుపై అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ సహాయం చేస్తుందని ఆమె చెప్పారు. అత్యవసర ప్రజారోగ్య సేవలు అవసరమైనవారికి ఈ ప్రొడక్ట్స్ అందుబాటును వేగవంతం చేయడమే లక్ష్యమని ఆమె చెప్పారు. దీనివల్ల దేశాలుకరోనా  వ్యాక్సిన్ దిగుమతి చేసుకోవడానికి, ప్రజలకు ఇవ్వడానికి సంబంధించిన అనుమతుల మంజూరును వేగవంతం చేయడానికి వీలవుతుందని ఆమె చెప్పారు.

ఇటువంటి టీకాలు తీసుకున్నవారు సురక్షితంగా ఉన్నట్లు వివిధ దేశాలు పరిగణిస్తున్నట్లు ఆమె తెలిపారు. వీరిని అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణాల కోసం కరోనా టీకా  చేయించుకోవాలనే నిబంధన ప్రస్తుతం మన దేశంతోపాటు చాలా దేశాల్లో లేదని ఆమె స్పష్టం చేశారు.