స్వతంత్రంగా వ్యవహరించని ఏపీ ఎన్నికల సంఘం!

ఆంద్ర ప్రదేశ్  రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) పనితీరుపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు కనబడడం లేదని చేసింది. అది దాఖలు చేసిన అఫిడవిట్‌లోని వివరాలు పరిశీలిస్తే.. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నట్లు కనపడుతోందని కటువుగా వ్యాఖ్యానించింది. 

ఎస్‌ఈసీ రాజ్యాంగ నిబంధనలకు లోబడి తన విధులు నిర్వర్తించాలని అనుకుంటోదా లేక ప్రభుత్వంతో కలిసి ప్రయాణించాలని కోరుకుంటోందో స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలను గ్రామ పంచాయతీలుగా పరిగణిస్తారా.. లేక మున్సిపాలిటీగా గుర్తించారా అనే విషయాన్ని స్పష్టం చేయాలని రాష్ట్రప్రభుత్వాన్నీ నిర్దేశించింది. 

‘ఒకవేళ మున్సిపాలిటీగా పరిగణిస్తే నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిందే కదా! ఎన్నికలు జరపకుంటే స్థానిక ప్రజలు తమ సమస్యలను చెప్పుకొనేందుకు ఎవరిని కలవాలి’ అని ప్రశ్నించింది. 

మూడు రాజధానుల చట్టం రద్దు, సీఆర్‌డీఏ చట్టం తిరిగి అమల్లోకి రావడం తదితర పరిణామాల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ విషయంలో తాజా వివరాలను కోర్టు ముందుంచాలని ఎస్‌ఈసీని, రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌  ఆదేశాలిచ్చారు. రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు కొమ్మినేని కోటేశ్వరరావు, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చింది. 

పిటిషనర్ల తరఫున న్యాయవాది కె ఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ  ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్‌ఈసీ అఫిడవిట్‌ వేసిందని, ఎన్నికల నిర్వహణకు సిద్ధమే గానీ రాష్ట్రప్రభుత్వం పరిపాలనాపరమైన సహకారం అందించాలని అది చెబుతోందని విస్మయం వ్యక్తం చేశారు.  ఎస్‌ఈసీ స్వతంత్రంగా వ్యవహరించాలి తప్ప సర్కారుకు వంతపాడడానికి వీల్లేదని చెప్పారు.

కాగా, రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలను గ్రామ పంచాయతీలుగా పరిగణించకూడదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ గ్రామాలను రాజధాని ప్రాంతంగా గుర్తిస్తూ ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టం చేసిందని, దీంతో ఈ ప్రాంతం మున్సిపాలిటీగా రూపాంతరం చెందిందని చెప్పారు. అందుచేత అమరావతి ప్రాంతంలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు.