పీఆర్సీ ఒక్కటే కాదు అన్ని సమస్యలు పరిష్కరించాలి

 ఏపీ ఉద్యోగుల పీఆర్సీతో పాటు దీర్ఘకాలిక ఉద్యోగ సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతుందని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నేత అప్పలరాజు, ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు స్పష్టం చేశారు. జగన్‌ ప్రభుత్వం మొండివైఖరికి నిరసనగా నిర్వహిస్తున్న తొలి దశ ఆందోళనలో భాగంగా శుక్రవారం విజయవాడలో సింహగర్జన పేరిట నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ  అధికారంలోకి వస్తే సీపీఎస్‌ రద్దు చేస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

సీఎంగా గెలిచి రెండున్నర ఏండ్లు గడుస్తున్న ఇంతవరకు సమస్యను పరిష్కరించడం లేదని ధ్వజమెత్తారు. సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని తీసుకురావాలని వారు డిమాండ్‌ చేశారు. సీపీఎస్ రద్దు కాకుండా ప్రత్యామ్నాయాలు అవసరం లేదని  తేల్చి చెప్పారు.పీఆర్సీ ప్రకటన చేసినా ఉద్యమం విరమించమని వెల్లడించారు. రెండో దశ ఉద్యమ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని వారు తెలిపారు. ఈ నెల 13న అన్ని జిల్లాల్లోని తాలుకా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపడుతామని వారు పేర్కొన్నారు.

పిఆర్‌సితోపాటు 71 డిమాండ్లపై స్పష్టమైన హామీ కోసం ఎపి జెఎసి, ఎపి జెఎసి అమరావతి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు చేపట్టిన నిరసనలు కొనసాగాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్‌, తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట మధ్యాహు భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసనలు తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల అందరి కోసం తమ పోరాటమని, సమస్యల పరిష్కారానికి తమ తుది శ్వాస వరకు పోరాడతామని  బప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. నిరసన కార్యక్రమాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్న నాయకుల తీరును ఉద్యోగులందరూ గమనిస్తున్నారని కోరారు. ‘చేతనైతే ఉద్యమానికి సహకరించండి. లేదంటే వ్యక్తిగతంగా ఉద్యమాల కోసం పోరాడండి. అంతేగానీ విమర్శలు మాత్రం మానుకోండి’ అని విజ్ఞప్తి చేశారు.