హెలికాప్టర్‌ ప్రమాదంలో చిత్తూరు జిల్లావాసి మృతి

జనరల్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిన ప్రమాదంలో చిత్తూరు జిల్లావాసి మృతి చెందారు. కురబల కోట మండలం ఎగువ రేగడ గ్రామానికి చెందిన సాయితేజ రక్షణశాఖలో లాన్స్‌నాయక్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సీడీఎస్‌ వ్యక్తిగత భద్రతాసిబ్బందిలో సభ్యుడు. 

సాయితేజ మృతి పట్ల చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 2013లో బెంగళూరు రెజిమెంట్‌ నుంచి ఆర్మీ సిపాయిగా సాయితేజ్‌ ఎంపికయ్యారు. సిపాయిగా పనిచేస్తూనే పారాకమాండో పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యారు. ప్రస్తుతం 11వ పారాలో లాన్స్‌నాయక్‌ హోదాలో పనిచేస్తున్నారు.

సాయితేజకు భార్య శ్యామల, కుమార్తె దర్శిని, కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు.  ‘పాప దర్శిని ఏం చేస్తోంది.. మోక్షజ్ఞ స్కూల్‌కు వెళ్లాడా.. చిట్టితల్లిని చూడాలని ఉంది. వీడియో కాల్‌ చేస్తా’ అంటూ భార్య శ్యామలతో లాన్స్‌నాయక్‌ బి.సాయితేజ బుధవారం ఉదయం 8.45 గంటలకు మాట్లాడారు. 

భార్య, పాపను వీడియోకాల్‌లో చూస్తూ తాను చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో కలిసి తమిళనాడు వెళుతున్నానని.. వీలు కుదిరితే సాయంత్రం చేస్తానని టాటా చెప్పిన సాయితేజ.. అనంతరం కొన్ని గంటల్లోనే హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

చివరిసారిగా వినాయక చవితికి సాయితేజ్‌ స్వగ్రామానికి వచ్చినట్టు బంధువులు తెలిపారు. ఊహించని ఈ ఘటనతో సాయితేజ స్వస్థలం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామం షాక్‌కు గురైంది. ప్రమాద విషయం తెలుసుకున్న సాయితేజ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు మదనపల్లెలో భార్య శ్యామల నివాసం ఉంటున్న ఇంటికి, ఎగువరేగడ గ్రామంలో తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నారు. 

సాయితేజ మరణ వార్త తెలిసి తల్లిదండ్రులు సొమ్మసిల్లి పడిపోయారు. తల్లి భువనేశ్వరిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. విధి నిర్వహణలో భాగంగా  కశ్మీర్, బెంగళూరు హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీలోబిపిన్‌ రావత్‌ వద్ద పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

తల్లి భువనేశ్వరి మాజీ ఎంపీటీసీ, తండ్రి మోహన్‌ సాధారణ రైతు. తమ్ముడు మహేష్‌ఆర్మీలో సిపాయిగా సిక్కింలో పని చేస్తున్నారు. సాయితేజకు 2016లో శ్యామలతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు మోక్షజ్ఞ (5), పాప దర్శిని (2) సంతానం. కుమారుడు మోక్షజ్ఞ చదువు కోసం సాయితేజ భార్య శ్యామల మదనపల్లె ఎస్‌బీఐ కాలనీ రోడ్‌ నెం.3లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు