అవగాహన కుదరడంతో నేడే రైతుల నిరసనకు ముగింపు!

రైతుల డిమాండ్ల పరిష్కారానికి కేంద్రప్రభుత్వం బుధవారం చేసిన ప్రతిపాదనపై ఏకాభిప్రాయం కుదిరిందని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) వెల్లడించింది. అయితే, ఆ ప్రతిపాదనను ప్రభుత్వ  అధికారికంగా ప్రకటించాలని డిమాండ్‌ చేసింది. ఉద్యమాన్ని కొనసాగించాలా.. నిలిపివేయాలా.. అన్నదానిపై గురువారం మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకొంటామని తెలిపింది. 

మంగళవారం కేంద్ర హోంశాఖ రైతుల కమిటీకి చేసిన ప్రతిపాదనపై ఎస్కేఎం బుధవారం సమావేశమైంది. ఆ ప్రతిపాదనను నిరాకరించింది. దీంతో కేంద్రం దాన్ని సవరించి కొత్త ప్రతిపాదన చేసింది. సమావేశం అనంతరం ఎస్కేఎం కోర్‌ కమిటీ సభ్యుడు, రైతు నేత గుర్నామ్‌ సింగ్‌ చూడానీ విలేకరులతో మాట్లాడారు.

‘గురువారం మధ్యాహ్నం సింఘు సరిహద్దులో 12 గంటలకు ఎస్కేఎం మళ్లీ సమావేశం అవుతుంది’ అని చెప్పా రు. కేంద్రం ప్రతిపాదన వివరాలను వెల్లడించలేదు. ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం, మద్దతుధరల చట్టం తదితర డిమాండ్లపై కేంద్రంతోచర్చలకు ఎస్కేఎం ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.

ఎస్‌కెఎం పంపిన సవరణలపై కేంద్ర ప్రభుత్వానికి, సంయుక్త కిసాన్‌ మోర్చా కమిటీ సభ్యులకు ఫోన్‌లో దాదాపు నాలుగు గంటల పాటు చర్చ జరిగింది. కొన్ని అంశాలపై స్పష్టత వచ్చినట్లు ఎస్‌కెఎం కమిటీ సభ్యులు అశోక్‌ ధావలే, బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌, గుర్నామ్‌ సింగ్‌ చారుని, శివకుమార్‌ కక్కాజీ, యుద్వీర్‌ సింగ్‌  విలేకరులకు తెలిపారు.

తాము చేసిన సవరణలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, ఆ విషయాన్నే ప్రభుత్వం అధికారికంగా లిఖితపూర్వకంగా తెలియజేయమని కోరామని, దాని కోసం వేచి చూస్తున్నామని పేర్కొన్నారు. రైతు ఉద్యమ సమయంలో ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో రైతులపై అక్రమంగా బనాయించిన కేసులను రైతు ఉద్యమం ముగించిన తరువాత ఉపసంహరించుకుంటామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

ముందు కేసులు ఉపసంహరించుకోవాలని, తరువాతే ఉద్యమం ఆపుతామని ఎస్‌కెఎం సవరణ చేసింది. వెంటనే కేసుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికే పంజాబ్‌ ప్రభుత్వం కేసులను ఉపసంహరించుకుంది. ఉద్యమంలో మరణించిన రైతులపై ఆధారపడిన కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు హర్యానా, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని కేంద్రం తెలిపింది. అంగీకారం కాదు, కేంద్రమే ఆ రెండు రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని ఎస్‌కెఎం సూచించింది.

పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)పై చట్టబద్ధమైన హామీ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, ప్యానెల్‌లో ఎస్‌కెఎం వెలుపల ఉన్న రైతు సంఘాలు, ప్రభుత్వ అధికారులు, ప్రతినిధులు, రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉంటారని ప్రభుత్వం తెలిపింది.

దీనిపై ఎస్‌కెఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. మొదటి నుంచి రైతు డిమాండ్లకు వ్యతిరేకంగా ఉన్నవారు ఎంఎస్‌పి కమిటీలో ఉండకూడదని ఎస్‌కెఎం పేర్కొంది. విద్యుత్‌ బిల్లును వెనక్కి తీసుకుంటామని గత చర్చల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు భాగస్వామ్యపక్షాలతో చర్చించి పార్లమెంటులో పెట్టాలనుకుంటున్నామని చెప్పారు. ఇది ఆమోద యోగ్యం కాదని ఎస్‌కెఎం తేల్చి చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం దీనిపైనా స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది.

కాగా, రైతుల మరణాలను నమోదు చేయాల్సింది రాష్ట్రాలలే అని  కేంద్ర మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ పార్లమెంటుకు తెలిపారు. రైతు మరణాలకు పరిహారం చెల్లించాల్సింది కూడా రాష్ట్రాలే అని స్పష్టం చేశారు.  సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో చనిపోయిన రైతుల వివరాలపై ప్రశ్నకు ఆయన ఈ మేరకు రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఉద్యమంలో రైతులు చనిపోతే.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నమోదు చేసి సమాచారం ఇవ్వాలని చెప్పారు.