12.08 నిమిషాల‌కు ఏటీసీతో తెగిన‌ హెలికాప్ట‌ర్ లింక్‌

ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్ మృతిచెందిన సంఘటనపై ఇవాళ లోక్‌స‌భ‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న చేస్తూ  సులూరు ఎయిర్‌బేస్ నుంచి హెలికాప్ట‌ర్ ఎగిరింద‌ని, 12.08 నిమిషాల‌కు ఆ హెలికాప్ట‌ర్‌తో ఏటీసీ సంబంధాలు తెగిపోయాయ‌ని తెలిపారు.

హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో 13 మంది మృతిచెందిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ప్ర‌మాదంలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ గ్రూప్ కెప్టెన్ వ‌రుణ్‌ సింగ్ లైఫ్ స‌పోర్ట్‌పై ఉన్నార‌ని, ఆయ‌న్ను బ్ర‌తికించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన‌వారికి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిస్తున్న‌ట్లు తెలిపారు. మిలిట‌రీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో బిపిన్ రావ‌త్ దంప‌తులు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

వెల్లింగ్ట‌న్ కాలేజీ స్టూడెంట్స్‌తో ఇంట‌రాక్ట్ అయ్యేందుకు అక్క‌డ‌కు వెళ్లార‌న్నాని ,  అయితే మంట‌ల్లో కాలిపోతున్న హెలికాప్ట‌ర్‌ను స్థానికులు చూశార‌ని, దాంట్లో ప్రాణాల‌ను కొట్టుమిట్టాడుతున్న‌వారిని కాపాడేందుకు స్థానికులు ప్ర‌య‌త్నించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన ర‌క్ష‌ణ ద‌ళ సిబ్బంది పేర్ల‌ను రాజ్‌నాథ్ చ‌దివి వినిపించారు.

పార్డీవ దేహాల‌ను వైమానిక ద‌ళ విమానంలో ఇవాళ ఢిల్లీకి తీసుకురానున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఎయిర్ చీఫ్ మార్షెల్ చౌద‌రీ నిన్న‌నే ఆ ప్రాంతానికి వెళ్లిన‌ట్లు తెలిపారు. ఘ‌ట‌న‌పై ట్రై స‌ర్వీస్‌ ఎంక్వైరీకి ఆదేశించిన‌ట్లు చెప్పారు. ఎయిర్ మార్ష‌ల్ మ‌న‌వేంద్ర సింగ్ నేతృత్వంలో విచార‌ణ జ‌ర‌గ‌నున్న‌దని చెప్పారు.

విచార‌ణ అధికారులు నిన్న‌నే వెల్లింగ్ట‌న్ చేరార‌ని, వాళ్లు ద‌ర్యాప్తు కూడా మొద‌లుపెట్టిన‌ట్లు చెప్పారు. పూర్తి సైనిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు రాజ్‌నాథ్ తెలిపారు. స్పీక‌ర్ ఓం బిర్లా కూడా నివాళి అర్పించారు. ఆ త‌ర్వాత రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

కాగా, ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంపై కోయంబత్తూరు ఏటీసీ కీలక ప్రకటన చేసింది. హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు ఎలాంటి సంకేతాలు రాలేదని తెలిపింది. అత్యవసర సహాయం అవసరమైతే ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీ ఉపయోగిస్తారని, ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉంటే… పైలెట్‌ ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీ ద్వారా సాయం కోరుతారని ఏటీసీ వెల్లడించింది.

4వేల అడుగుల తర్వాత ఏటీసీ నుంచి వెల్లింగ్టన్‌ బేస్‌కు ఛేంజ్‌ ఓవర్‌ అయ్యారని, ఆ తర్వాత ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయని తెలిపింది. కోయంబత్తూరులో తక్కువ ఎత్తులో ప్రయాణించే… విమానాలు, చాపర్లను గుర్తించే రాడార్‌ వ్యవస్థ లేదని ఏటీసీ పేర్కొంది.

ఇలా ఉండగా, ఆర్మీ హెలికాప్ట‌ర్ కూలిన దుర్ఘ‌ట‌న‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ మృతికి బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రావ‌త్ కుటుంబ‌స‌భ్యులతో పాటు ఆ ప్ర‌మాదంలో చ‌నిపోయిన ఇతర సైనికుల కుటుంబాలకు కూడా ఆయన సంతాపం తెలియజేశారు. 

హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ సహా 13 మందికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఆర్మీ అధికారులు నివాళులర్పించారు. సీడీఎస్‌ రావత్‌ దంపతుల భౌతికకాయాలను ఢిల్లీకి తరలించడానికి ముందుగా.. మిలటరీ హాస్పిటల్‌ నుంచి వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజీలో వారి పార్థివదేహాలను ఉంచారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌తోపాటు ఏర్‌ చీఫ్‌ మార్షల్‌ వీర్‌ చౌధరీ మృత వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.