జర్మనీ కొత్త ఛాన్సలర్‌గా ఓలాప్ సోల్జ్

జర్మనీ పార్లమెంట్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తమ దేశ తొమ్మిదవ ఛాన్సలర్‌గా ఓలాఫ్ సోల్జ్‌ను ఎన్నుకుంది. దీంతో ఐరోపా యూనియన్‌లో అత్యధిక జనభా ఉన్న ఆ దేశంలో ఓ నవ శకానికి దారులు తెరిచినట్లయింది. 16 ఏళ్ల పాటు ఛాన్సలర్‌గా పనిచేసిన ఏంజెలా మెర్కెల్ స్థానంలో ఆయన కొత్త ఛాన్సలర్ కానున్నారు. 

జర్మనీని ఆధునీకరించడం, వాతావరణ మార్పును ఎదుర్కొనడం వంటివి సోల్జ్ ప్రాధాన్యతలు కానున్నాయి. జర్మనీ శాసనకర్తలు 395-303 ఓట్ల తేడాతో ఆయనను ఎన్నుకున్నారు. ఓటింగ్‌లో ఆరుగురు గైర్హాజరయ్యారు. 736 సీట్లున్న దిగువ సభ పార్లమెంటులో మూడు పార్టీల సంకీర్ణానికి 416 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం పార్లమెంటు సభ్యురాలుగా లేని ఏంజెలా మెర్కెల్ పార్లమెంటు ఓటింగ్‌ను ప్రేక్షకుల గ్యాలరీ నుంచి తిలకించారు.

సోల్జ్ 2018 నుంచి జర్మనీ వైస్ ఛాన్సలర్‌గా, ఆర్థిక మంత్రిగా ఉన్నారు. జర్మనీలోని మూడు పార్టీలు ఆయనకు పట్టంకట్టాయి. ఆయన సెంటర్‌లెఫ్ట్ సోషల్ డెమోక్రాట్స్ పార్టీకి చెందినవాడు కాగా, ఎన్విరాన్‌మెంటలిస్టులైన గ్రీన్స్, ప్రొబిజినెస్ ఫ్రీ డెమోక్రాట్స్ ఇతర పార్టీలు. సంకీర్ణ భాగస్వాములు ఓటింగ్ వయస్సును 18 నుంచి 16కు తగ్గించాలనుకుంటున్నారు. 

జర్మనీ ప్రభుత్వం కనీస వేతనాన్ని గంటకు 9.60 యూరోల నుంచి 12 యూరోలకు పెంచాలని యోచిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం సంవత్సరానికి 4 లక్షల కొత్త ఇళ్లు కట్టాలనుకుంటోంది. విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తానని సోల్జ్ తెలిపారు. బలమైన ఐరోపా  యూనియన్‌కు పాటుపడుతుందని కూడా ఆయన తెలిపారు.

ఇక గ్రీన్స్ సహ నాయకుడు రాబర్ట్ హాబెక్ వైస్ ఛాన్సలర్ కానున్నారు. ఆయన ఆర్థిక, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖకు నేతృత్వం వహించనున్నారు. ఇక ప్రభుత్వంలో మూడో స్థానం నాయకుడు క్రిస్టియన్ లిండర్ ఉండనున్నారు. ఆయన పన్నులు పెంచడాన్ని సంకీర్ణ ప్రభుత్వం తిరస్కరించాలని కోరుతున్నారు. 

“ఒకవేళ మంచి సహకారం లభిస్తే ప్రభుత్వం బాగానే పనిచేయగలదు. మా ముందున్న లక్ష్యాలకు ఇది మంచి సమయం” అని సోల్జ్ తెలిపారు. ఇదిలావుండగా మరోసారి రాజకీయ పాత్ర పోషించబోనన్న ఏంజెలా మెర్కెల్ తన భవిష్యత కార్యాచరణ గురించి ఏమి చెప్పలేదు. అయితే ఆమె ఇదివరలో చదువడానికి, నిద్రించడానికి సమయాన్ని వెచ్చిస్తానని పేర్కొన్నారు.