న్యూజిలాండ్ బాలలకు సిగరెట్ల విక్రయంపై నిషేధం 

2027 నుంచి 14 ఏండ్ల‌లోపు పిల్ల‌ల‌కు సిగ‌రెట్ల విక్ర‌యాన్ని న్యూజీలాండ్ ప్రభుత్వం నిషేధంచ‌నున్న‌ది. ఆరేండ్ల త‌ర్వాత 14 ఏండ్ల‌లోపు వ‌య‌స్సు గ‌ల 50 ల‌క్ష‌ల మంది జీవితంలో ఒక్క‌సారి కూడా సిగ‌రెట్ల‌ను కొనుగోలు చేయ‌కుండా నిబంధ‌న‌లు అమ‌ల్లోకి తేనున్న‌ది.

ఇప్ప‌టికే పొగాకు ప‌రిశ్ర‌మ‌పై క‌ఠిన ఆంక్ష‌లతో కొర‌డా ఝుళిపిస్తున్న ప్ర‌పంచ దేశాల్లో ఒక‌టిగా న్యూజిలాండ్‌ నిలిచింది. సుదీర్ఘ‌కాలంలో స్మోకింగ్ అడ్డుకునేందుకు ఇత‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలిపింది  నికోటిన్ లెవెల్స్ త‌గ్గించిన పొగాకు ఉత్ప‌త్తులు మాత్ర‌మే విక్ర‌యించాల‌ని లేదంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని రిటైల్ వ్యాపారుల‌ను హెచ్చ‌రించింది.

“యువ‌త‌రం ఏనాడూ సిగ‌రెట్లు తాగ‌కుండా చూడాల‌న్న‌దే మా కోరిక‌. యువ‌త‌కు సిగ‌రెట్లు స‌ర‌ఫ‌రా చేసినా, విక్ర‌యించినా నేరంగా ప‌రిగ‌ణిస్తాం ” అని న్యూజిలాండ్ ఆరోగ్య‌శాఖ స‌హాయ మంత్రి ఆయేషా వెర్రాల్ ప్రకటించారు. వీటిల్లో కొత్త‌ద‌న‌మేమీ లేద‌ని మావోరీల్లో స్మోకింగ్ ఐదు శాతం లోపు దిగి వ‌చ్చేందుకు ద‌శాబ్దాల పాటు ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం న్యూజిలాండ్ వాసుల్లో 15 ఏండ్లు దాటిన వారు 11.6 శాతం మంది స్మోకింగ్ చేస్తున్నారు. మావోరి యువ‌జ‌నుల్లో స్మోకింగ్‌ 29 శాతంగా ఉంది. కొత్త‌గా ప్ర‌తిపాదించ‌నున్న స్మోకింగ్ నిషేధం.. పొగాకు ఉత్ప‌త్తుల నిషేధ బిల్లుల‌పై మావోరీ హెల్త్ టాస్క్‌ఫోర్స్‌తో ప్ర‌భుత్వం సంప్ర‌దింపులు జ‌రుప‌నున్న‌ది.

వ‌చ్చే జూన్‌లో పార్ల‌మెంట్‌లో బిల్లును ప్రవేశ పెట్ట‌నున్న‌ది. వ‌చ్చే ఏడాది చివ‌రిక‌ల్లా పొగాకు ఉత్ప‌త్తుల విక్ర‌య నిషేధ చ‌ట్టం అమ‌ల్లోకి రానున్న‌ద‌ని తెలుస్తోంది. 2024 నుంచి ద‌శ‌ల‌వారీగా ఆంక్ష‌ల‌ను న్యూజిలాండ్ స‌ర్కార్ అమ‌ల్లోకి తేనున్న‌ది.ఆథ‌రైజ్డ్ విక్రేత‌ల‌ను భారీగా త‌గ్గించ‌నున్న‌ది.

2025లో నికోటిన్ స్థాయి త‌గ్గించాల‌న్న నిబంధ‌న అమ‌లు చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటుంది. 2027 నాటికి న్యూజిలాండ్‌ను స్మోక్ ఫ్రీ జ‌న‌రేష‌న్‌గా తీర్చిదిద్ద‌నున్న‌ది. న్యూజిలాండ్‌లో ప్ర‌స్తుతం ఏటా ఐదు వేల మంది స్మోకింగ్‌తో మ‌ర‌ణిస్తున్నారు. 18 ఏండ్లలోపు వారిలో ప్ర‌తి ఐదుగురిలో న‌లుగురు స్మోకింగ్ చేస్తున్నారు.

ఆరోగ్య‌శాఖ అధికారులు ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నా, రిటైల‌ర్లు మాత్రం త‌మ వ్యాపారాలు దెబ్బ తింటాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. బ్లాక్ మార్కెటింగ్ జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని వాపోతున్నారు.