ఎర్ర టోపీలు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు రెడ్ అల‌ర్ట్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌ళ్లీ అధికారం చేజిక్కించుకోవాల‌ని ఎర్ర‌టోపీలు ఎదురుచూస్తున్నాయ‌ని ఆ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్‌వాది పార్టీని ఉద్దేశించి ప్రస్తావిస్తూ ఎర్ర‌టోపీలే యూపీకి రెడ్ అల‌ర్ట్ అని, ప్ర‌మాద ఘంటిక‌ల‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.  
 
ఇవాళ యూపీలో రూ 10,000 కోట్లకు పైగా విలువగల ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల‌కు ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ.. గోర‌ఖ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ వాళ్లు అధికారంలోకి వ‌స్తే ఉగ్ర‌వాదుల‌తో దోస్తీ చేస్తార‌ని, ఉగ్ర‌వాదుల‌ను జైళ్ల నుంచి విడిచిపెడుతార‌ని ఆరోపించారు.
 
ఎర్ర‌టోపీలు అధికారంలోకి వ‌స్తే ఎర్ర‌బుగ్గ‌ల‌కు మాత్ర‌మే ప్రాధాన్యం ఇస్తార‌ని బుగ్గ‌కార్ల‌లో తిరిగే రాజకీయ నాయ‌కుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాని మోదీ వ్యాఖ్యానించారు. సాధార‌ణ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, బాధ‌లు వారికి ప‌ట్ట‌వ‌ని చెప్పారు. కుంభ‌కోణాలకు పాల్ప‌డ‌టానికి, ఖ‌జానా నింపుకోవ‌డానికి, దొరికింది దోచుకోవ‌డానికి, మాఫియా శ‌క్తుల‌కు స్వేచ్ఛ‌నివ్వ‌డానికే స‌మాజ్‌వాది పార్టీ అధికారంపై క‌న్నేసింద‌ని ఆరోపించారు.
 
 కరోనా వైరస్ సంక్షోభ సమయంలో సైతం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధిని కొనసాగించిందని ప్రధాని గుర్తు చేశారు.  అయితే అభివృద్ధి పనులు వీరికి అర్థం కాదని అంటూ ప్రధాన ప్రతిపక్షాన్ని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వాలు అభివృద్ధిని నిలిపేయలేదని స్పష్టం చేశారు. సదుద్దేశంతో పని చేస్తే, విపత్తులు సైతం అడ్డంకులు కాబోవని చెప్పారు.

అణగారిన వర్గాలు, అవకాశాలు లభించని వర్గాల గురించి ఆందోళన చెందే ప్రభుత్వం శ్రమించి పని చేస్తుందని, ఫలితాలను కూడా సాధిస్తుందని ప్రధాని చెప్పారు. దృఢ నిశ్చయం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పడానికి నేడు గోరఖ్‌పూర్‌లో కార్యక్రమమే నిదర్శనమని వివరించారు. 

రూ 8,603 కోట్ల విలువైన ఎరువుల కర్మాగారం, రూ. 1,011 కోట్లతో నిర్మించిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ కు  చెందిన హైటెక్ ల్యాబ్ ప్రధాని ప్రారంభించిన  ప్రాజెక్టులలో ఉన్నాయి.

“నవ భారతదేశానికి సంకల్పం వస్తే అసాధ్యమైనది ఏదీ లేదనేదానికి ఈరోజు గోరఖ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమం రుజువు” అని ప్రధాని మోదీ  తెలిపారు, ప్రతిపక్షాలు ఈ ప్రాంతంలో అభివృద్ధిని విస్మరించాయని ఆరోపించారు. అంతకుముందు గోరఖ్‌పూర్‌లోని అభివృద్ధి కార్యక్రమాల ప్రదర్శనను ఆయన సందర్శించారు.

‘‘2014కు ముందు యూరియా కొరతతో వార్తల్లో నిలిచేవాళ్లం.. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది.. వందశాతం వేపపూత పూసి యూరియా దుర్వినియోగాన్ని అరికట్టాం.. కోట్లాది మంది రైతులకు సాయిల్‌ హెల్త్‌ కార్డులు ఇచ్చాం.. తద్వారా ఎలాంటి ఎరువులు ఉన్నాయో.. వ్యవసాయ అవసరాలు, మేము యూరియా ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టాము” అని ప్రధాని మోదీ వివరించారు.

రాష్ట్రంలోని పౌరులందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు చేరాలని పేర్కొన్న ప్రధాని, రాష్ట్రంలో సౌకర్యాలను పెంచడానికి యోగి ప్రభుత్వం కృషి చేసిందని కొనియాడారు. “గతంలో గోరఖ్‌పూర్‌లోని మెదడువాపు వ్యాధిగ్రస్తుల నమూనాలను పూణేకు పంపేవారు.  అది నిర్ధారించే  సమయానికి, రోగి మరణించేవాడు  లేదా పక్షవాతానికి గురయ్యేవాడు. ఈ రోజు, మనం కరోనావైరస్, మెదడువాపు,  ఇతర వ్యాధులను పరీక్షించడానికి గోరఖ్‌పూర్‌లో ప్రాంతీయ వైరల్ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించాము” అని ప్రధాని గుర్తు చేశారు. 

ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించే ధైర్యం బిజెపి ప్రభుత్వానికి మాత్రమే ఉందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారురు, “ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమం తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని ప్రజలకు కలలు కన్నట్లుగా ఉంది. ఎరువుల కర్మాగారంను 1990లో మూసివేశారు.  2014 వరకు, దానిని పునఃప్రారంభించేందుకు ఎవరూ చొరవ తీసుకోలేదు. దీన్ని ప్రారంభించే ధైర్యం కేవలం బీజేపీ ప్రభుత్వానికి మాత్రమే ఉంది” అని చెప్పారు.