ఒమిక్రాన్‌తో టీకా వేసుకొని వారికి, పిల్లలకు ముప్పు

క‌రోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్‌తో వ్యాక్సిన్ వేసుకోని వారికి, పిల్ల‌ల‌కు ముప్పు పొంచి ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్ట్ డాక్ట‌ర్ సౌమ్య స్వామినాథ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ మూడురెట్లు వ్యాప్తి చెంద‌గ‌ల శ‌క్తి క‌లిగి ఉంద‌ని పెక్రోన్నారు. 

తొలిసారి వైర‌స్ సోకిన వారికి 90 రోజుల త‌ర్వాత రీ ఇన్‌ఫెక్ష‌న్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని ఓ ఆంగ్ల టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె  చెప్పారు. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ అని చెప్పారు. ప్రారంభంలో ఒమిక్రాన్ ఇన్‌ఫెక్ష‌న్ ల‌క్ష‌ణాల‌ను క‌నిపెట్ట‌డం సాధ్యం కాద‌ని ఆమె స్పష్టం చేశారు.

కేసుల సంఖ్య పెరుగుద‌ల‌, ద‌వాఖాన‌లో చేరుతున్న వారి సంఖ్య‌కు మ‌ధ్య స‌మ‌యం ఉంటుంద‌ని సౌమ్య స్వామినాధ‌న్ తెలిపారు. ద‌వాఖాన‌ల్లో చేరుతున్న వారిలో ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర‌త‌ను అంచ‌నా వేయ‌డానికి మ‌నం త‌ప్ప‌నిస‌రిగా రెండు నుంచి మూడు వారాలు వేచి చూడాల్సి ఉంద‌ని ఆమె చెప్పారు.

ద‌క్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ శ‌ర‌వేగంగా వ్యాపిస్తున్న‌ది. పిల్ల‌లు ఎక్కువ‌గా దీని బారీన ప‌డుతున్నారు. ద‌క్షిణాఫ్రికా ప్ర‌భుత్వం ఎక్కువ‌గానే ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ద‌ని సౌమ్యా స్వామినాధ‌న్ తెలిపారు. ప్ర‌స్తుతం వివిధ దేశాల వ‌ద్ద పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్ వేయ‌డానికి టీకాలు అందుబాటులో లేవ‌ని ఆమె విచారం వ్యక్తం చేశారు. 

కొన్ని దేశాలు మాత్ర‌మే పిల్ల‌లకు టీకాలు ఇస్తున్నాయ‌ని చెబుతూ  పిల్ల‌ల‌పై ఒమిక్రాన్ ప్ర‌భావం చూపుతున్న తీరుపై డేటా కోసం వేచి చూస్తున్నామ‌ని ఆమె చెప్పారు. ఇప్ప‌టికీ 25 దేశాలు త‌క్కువ వ్యాక్సినేష‌న్‌తో ఇబ్బందులు ప‌డుతున్నాయ‌ని సౌమ్యా స్వామినాధ‌న్ పేర్కొన్నారు.

ఈ నెల 16న డ‌బ్ల్యూహెచ్‌వో స‌మావేశ‌మై కొవోవాక్స్ టీకాను అత్య‌వ‌స‌ర వినియోగానికి అందుబాటులోకి తెచ్చేందుకు తీసుకుంటుంద‌ని ఆమె చెప్పారు. వ్యాక్సినేష‌న్‌పై స‌మ‌గ్ర శాస్త్రీయ అవ‌గాహ‌న అవ‌స‌రం అని చెప్పారు. వేరియంట్ వారీగా వ్యాక్సిన్ అవ‌స‌ర‌మైతే, ఆ టీకా ఎంత మేర‌కు రోగ నిరోధ‌క శ‌క్తి క‌లిగి ఉంటుంద‌న్న విష‌యం ఆధార‌ప‌డి ఉంటుంద‌ని వివరించారు.

47కుపైగా దేశాల్లో ఒమిక్రాన్

కాగా, వంబర్‌ నెలాఖరులో దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ ఉత్పరివర్తనం ఇప్పటి వరకు 47కుపైగా దేశాల్లో వెలుగు చూసింది. అయితే, ఇప్పటి వరకు ఈ వేరియంట్‌ కారణంగా మరణాలు మాత్రం సంభవించలేదు. వేగంగా విస్తరిస్తున్న వైరస్‌తో దక్షిణాఫ్రికా, అమెరికా సహాఐరోపాలోని దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి.

అమెరికా, యూరప్‌లో కొత్త వేరియంట్‌ సామాజిక వ్యాప్తి మొదలైంది నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్రత, ఇప్పుడు అందుబాటులో ఉన్న టీకాలు ఈ ఉత్పరివర్తనానికి వ్యతిరేకంగా మరింత రోగనిరోధక శక్తిని ఇస్తాయా? లేదా తెలుసుకునేందుకు పరిశోధనలు చేస్తున్నారు.

ఇలా ఉండగా,  కరోనా వ్యాక్సిన్ విష‌యంలో భారత దేశం మ‌రో మైలు రాయిని చేరుకుందని,  85 శాతం అర్హులైన‌ ప్ర‌జ‌లు మొద‌టి డోసును తీసుకున్నార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వ్య వెల్ల‌డించారు. దీంతో దేశ ప్ర‌జ‌ల‌కు అందించిన‌ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 127.93 కోట్ల‌కు చేరుకుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

 ”మ‌రో రోజు… మ‌రో మైలు రాయిని చేరుకున్నాం. 85 శాతం అర్హులైన ప్ర‌జ‌లు మొద‌టి డోసును తీసుకున్నారు. ప్ర‌ధాని మోదీ మంత్రం ”స‌బ్ కా ప్ర‌యాస్” అన్న నినాదంతో కోవిడ్‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్నాం” అని కేంద్ర మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వ్య ట్వీట్ చేశారు.