బిజెపి ఎంపీల గైరాజరుపై ప్రధాని ఆగ్రహం!

పలువురు బీజేపీ ఎంపీలు, మంత్రులు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. చాలామంది పార్టీ  ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కావడం లేదని.. ఇది ఇలానే కొనసాగితే కఠిన చర్యలు తప్పవని మోదీ హెచ్చరించినట్లు సమాచారం.
 
ఎంపీల  బాధ్యతలను గుర్తు చేస్తూ, సభాకార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పార్లమెంటుకు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు. పార్లమెంటుకు సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో మంగళవారం ఉదయం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. ”మారండి, లేదా మార్పు అనివార్యమవుతుంది” అంటూ పరోక్షంగా గైర్హాజరీ ఎంపీలకు హెచ్చరిక చేశారు. 
 
ప్రజలకు చేరువ కావాలని, తమ తమ నియోజవర్గాల్లో ఈవెంట్లు నిర్వహించాలని, పద్మ అవార్డు గ్రహీతలను గౌరవించాలని ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎంపీలకు ప్రధాని చేసిన సూచనలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలియజేస్తూ, పార్లమెంట్ క్రీడా పోటీలు, బాలల ఆరోగ్య పోటీలు,  సూర్యనమస్కార్ పోటీలు వంటివి నిర్వహించాలని ప్రధాని సూచించారు. 
 
పద్మ అవార్డు గ్రహీతలతో లైవ్ ప్రోగ్రామ్‌లు నిర్వహించాలని సూచించారని చెప్పారు. నవంబర్ 15వ తేదీ బిర్సా ముండా జయంతిని జన్‌జాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించినందుకు గాను ఈ సమావేశంలో ప్రధానికి ఎంపీలు అభినందనలు తెలియజేసినట్టు చెప్పారు.
కాగా, బీజేపీ  ఎంపీలు, మంత్రులు క్రమశిక్షణతో మెలగాలని,  సమయపాలన పాటించాలని.. చిన్న పిల్లల మాదిరి కుంటి సాకులు చెప్పవద్దని సూచించిన్నట్లు తెలిసింది. 

‘‘పార్లమెంట్‌ సమావేశాలకు, మీటింగ్‌లకు అందరూ క్రమం తప్పకుండా హాజరుకావాల్సిందే. పిల్లలకు చెప్పినట్లు.. పదే పదే దీని గురించి మీతో చర్చించడం నాకు బాగా అనిపించడం లేదు. మీరు మారకపోతే.. మార్పులు చేయాల్సి వస్తుంది’’ అని మోదీ హెచ్చరించారు. 

ఈ సమావేశానికి సీనియర్‌ మంత్రులు అమిత్‌ షా, పీయుష్‌ గోయల్‌, విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌, పార్లమెంటు వ్యవహరాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తదితరులు హాజరయ్యారు.