కాంగ్రెస్ కు ప్రతిపక్ష నాయకత్వం దైవదత్తం కాదు

పార్టీ నాయకత్వమనేది దైవదత్త అధికారం కాదని, ప్రతిపక్ష నాయకత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవాలని ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ స్పష్టం చేస్తూ పరోక్షంగా రాహుల్ గాంధీ నాయకత్వం బలహీనతలను ఎత్తిచూపారు.  , ఇక ఆ పార్టీ నాయ‌క‌త్వం ఓ వ్య‌క్తికే చెందిన‌ దైవ హ‌క్కుగా భావిస్తున్న‌ట్లు ప్ర‌శాంత్ కిషోర్ విమ‌ర్శించారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రస్తుతం ఉనికిలో లేదని టిఎంసి అధినేత్రి, బెంగాల్ సిఎం మమతాబెనర్జీ వ్యాఖ్యానించిన మరుసటి రోజే ప్రశాంత్ తన వ్యాఖ్యల్ని ట్విట్ చేయడం గమనార్హం.
 
బలమైన ప్రతిపక్షం ఏర్పాటులో కాంగ్రెస్‌కు కీలక పాత్ర ఉంటుందన్నారు. గత పదేళ్లలో జరిగిన 90 శాతం ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిందని ఆయన గుర్తు చేశారు. సగంకాలం విదేశాల్లో ఉండేవారు రాజకీయాల్లో ఏమీ సాధించలేరని మమతా పేర్కొనడం ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. 
 
కాంగ్రెస్ ను దూరం పెట్టె యత్నం 
 
ఇలా ఉండగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బిజెపి నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల మధ్య అంతర్గత విభేధాలు ఉన్నట్లు కనపడుతోందని పేర్కొన్నారు. 
రానున్న కాలంలో బిజెపికి ప్రత్యామ్నాయంగా ఎవరు ముందుకు వస్తారో తేలుతుందని ఫడ్నవీస్ తెలిపారు. 2019లో బిజెపికి వ్యతిరేకంగా జతకట్టినప్పటికీ ప్రతిపక్షాలు విఫలమయ్యాయని, అటువంటి కూటములను ప్రజలు అంగీకరించబోరని ఆయన స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఎవరు ఎవరితో జతకట్టినప్పటికీ 2024 సార్వత్రిక ఎన్నికలలో విజేత నరేంద్ర మోదీయేనంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.