భారత దిగ్గజ అథ్లెట్‌ అంజూ ‘వుమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’

భారత దిగ్గజ అథ్లెట్‌ అంజూ బాబీ జార్జ్‌ (44)కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పతకం (లాంగ్‌జంప్‌, 2003) నెగ్గిన ఏకైక భారత అథ్లెట్‌గా చరిత్రకెక్కిన అంజూకి ప్రపంచ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ‘వుమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు ప్రకటించింది. 
 
దేశంలో ప్రతిభను పెంపొందించడంతో పాటు లింగ సమానత్వం కోసం చేసిన కృషికి గాను ఆమెకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. బుధవారం అర్ధరాత్రి దాటాక వర్చువల్‌ విధానంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో 44 ఏండ్ల అంజూకు ఈ పురస్కారం లభించింది. ప్రపంచ అథ్లెటిక్స్‌ సంఘం నుంచి భారత అథ్లెట్‌కు వార్షిక అవార్డు దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం.
 
 ‘భారత్‌కు చెందిన మాజీ లాంగ్‌జంప్‌ స్టార్‌ అంజూబాబీ జార్జ్‌ ఇప్పటికీ ఆటతో అనుబంధం కొనసాగిస్తున్నది. 2016లో అకాడమీ స్థాపించి బాలికలకు శిక్షణ ఇస్తున్నది. ఆమె వద్ద శిక్షణ పొందినవారిలో ప్రపంచ అండర్‌-20 స్థాయి పతకాలు సాధించిన వారు ఉన్నారు’ అని వరల్డ్‌ అథ్లెటిక్స్‌ సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ అవార్డు తన కృషికి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అంజూ తెలిపింది. ‘ప్రపంచ అథ్లెటిక్స్‌ సంఘం నుంచి ‘వుమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఇది చాలా సంతోషకర సమయం. ఆట నాకు ఎంతో ఇచ్చింది. దానికి తిరిగి ఇవ్వడం కంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదు. నా కృషిని గుర్తించినందుకు ధన్యవాదాలు’ అని అంజూ ట్వీట్‌ చేసింది.
 
బాబీ జార్జ్‌ ఇప్పటికీ క్రీడల్లో చురుకుగా పాల్గొంటారు. 2016లో అకాడమీని ప్రారంభించి పలువురు యువతులకు శిక్షణనివ్వడం ప్రారంభించారు. 2003 వరల్డ్‌ చాంపియన్‌షిప్  లాంగ్‌ జంప్‌లో బాబీ కాంస్య పతకం సాధించింది. 
 
ఇటీవలే జరిగిన వరల్డ్‌ అండర్‌-20 అథ్లెటిక్స్‌లో రజతం సాధించిన షైలీ సింగ్‌.. అంజూ శిష్యురాలే. వరల్డ్‌ అథ్లెట్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఒలింపిక్‌ చాంపియన్లు ఎలైన్‌ థామ్సన్‌ హెరా (జమైకా), కర్సెటెన్‌ వార్‌హౌమ్‌ (నార్వే) ఎంపికయ్యారు. గతంలో ఈ అవార్డులను వరల్డ్‌ అథ్లెటిక్స్‌ గాలా అవార్డులుగా పిలిచేవారు.