మీడియా సమక్షంలో చర్చకు కేసీఆర్ కు కిషన్ రెడ్డి సవాల్!

వరి ధాన్యం సేకరణ విషయమై బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సవాల్ కు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సై అన్నారు. కేసీఆర్ బూతులు మాట్లాడకుంటే తాను మాట్లాడిన మాటలపై ఎక్కడైనా చర్చకు సిద్దమే అని స్పష్టమే చేశారు. అమరవీరుల స్థూపం దగ్గర మీడియా సమక్షంలో చర్చకు రావాలని కేసీఆర్ కు సవాల్ చేశారు. 

 పార్లమెంట్ సమావేశాలు జరుగతున్నాయ ని చెబుతూ సమావేశం లేని రోజు చర్చకు తాను సిద్ధం అని తెలిపారు. ఆదివారం మీడియా సమావేశంలో తనను దుర్భాషలాడుతూ కేసీఆర్ ఈ సవాల్ చేయడాన్ని ప్రస్తావిస్తూ సీఎం అనాగరిక భాష మాట్లాడటం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. 

కేసీఆర్ మీడియా సమావేశం జరిగిన తీరు గమనిస్తే ఆయనలో అభద్రతాభావం కనిపిస్తున్నదని, టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయినట్లు ఆందోళనలో ఉన్నట్లున్నారని స్పష్టం అవుతుందని పేర్కొన్నారు.  అందువల్లే ఇష్టనుసారంగా మాట్లాడారని విచారం వ్యక్తం చేశారు. కేసీఆర్ స్థాయికి దిగజారి  మాట్లాడలేనని స్పష్టం చేశారు. 

తాను మంత్రి కావడం కేసీఆర్ కు ఇష్టం లేనట్లుందని కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. “కేసీఆర్‌కి నేను అంటే కోపమో, బాధనో అర్ధం కావడం లేదు. చాలా సార్లు కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదు. ఎంపీ సంతోష్‌తో మాట్లాడను. అపాయింట్మెంట్ కావాలని అడిగినా ఇవ్వలేదు.’’ అని కిషన్ రెడ్డి తెలిపారు. 

టీఆర్ఎస్ నాయకులు ఢిల్లీకి వచ్చినా కేంద్ర మంత్రిగా ఉన్న తన సహకారం కావాలని ఏనాడు కోరలేదని పేర్కొన్నారు. కేసీఆర్ కు తానంటే కోపమో,బాధో అర్ధం కావడం లేదని పేర్కొంటూ తనను విమర్శించడానికి మాటలు లేవా అని ప్రశ్నించారు. తనను రండా అని మాట్లాడటం కేసీఆర్ విజ్ణతకే వదిలేశానని చెప్పారు. 

 సీఎం కేసీఆర్ ఆకాశం ఊడిపడినట్టు, భూమి బద్దలైన్నట్టు, టీఆర్ఎస్ పార్టీ కూలిపోయానట్టు కేసీఆర్ మాట్లాడారని అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేసారు.  తాను సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చానని,  తెలంగాణ ఉద్యమమంలో పోరాట యాత్ర కూడా చేపట్టానని, బీజేపీ కేంద్ర న్యాయకత్వాన్ని తెలంగాణ బిల్లుకు ఒప్పించానని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు కూడా తెలంగాణ బిడ్డ కేంద్రమంత్రి అయ్యాడని చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

తన గురించి కేసీఆర్ ఏమి మాట్లాడినా బాధలేదని అంటూ  ప్రజలు ఎవరు ఏంటి అనేది నిర్ణయిస్తారని పేర్కొన్నారు. తనపై  చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ నైతికతకు వదిలేస్తున్నానని చెప్పారు.  తాను తెలంగాణ గడ్డమీదే పుట్టానని, కేసీఆర్ మాటలకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వాడిన భాష ఏ రకమైనదో ఆయనే చెప్పాలని అంటూ ప్రజాస్వామ్యబద్దంగా నాగరిక భాషలో విమర్శించవచ్చని హితవు చెప్పారు. యాసంగి ధాన్యం విషయంలో తెలంగాణ రైతులకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశానని ఆయన తెలిపారు. కేంద్రానికి సంబంధించిన మంత్రితో మాట్లాడి చెప్పానని,  ఉన్న బాయిల్డ్ రైస్ కొంటామని చెప్పారని కిషన్ రెడ్డి తెలిపారు. 

‘రాష్ట్రంలో వానాకాలంలో పండిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని కేంద్ర ఆహార శాఖ మంత్రి ఆదేశంతోనే ప్రకటన చేశాను. కళ్లాలు, రోడ్లు, కొనుగోలు కేంద్రాల్లో రెండు నెలలుగా ధాన్యం పెట్టుకొని ఇబ్బందులు పడుతున్న తెలంగాణ రైతులకు భరోసా ఇవ్వాలన్న ఆయన సూచన మేరకే ఆ విధంగా చెప్పాను’ అని కిషన్‌ రెడ్డి వెల్లడించారు. 

యాసంగి సంగతి తర్వా త చూద్దాం కానీ, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతులను గందరగోళంలో పడేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆహార శాఖ మంత్రితో మాట్లాడిన అనంతరమే చివరి బస్తా వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించానని, అంతేతప్ప కేసీఆర్‌ను విమర్శించడం కోసమో, తిట్టడం కోసమో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు.