ట్విట్ట‌ర్ సీఈవోగా భారతీయుడు ప‌రాగ్ అగ‌ర్వాల్

అమెరికాలోని మరో కీలక సాంకేతిక సంస్థకు భారత వారసత్వం గల వ్యక్తి ప్రధాన కార్యనిర్వహణ అధికారి అయ్యారు. మైక్రో బ్లాగింగ్ సోష‌ల్ మీడియా వేదిక ట్విట్ట‌ర్ సీఈవోగా జాక్ డోర్సీ వైదొలిగడంతో ఆయ‌న స్థానంలో డోర్సీ వార‌సుడిగా.. సంస్థ చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ (సీటీవో) ప‌రాగ్ అగ‌ర్వాల్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 

భార‌త్‌లో పుట్టిన ప‌రాగ్ అగ‌ర్వాల్‌.. బాంబే ఐఐటీలో కంప్యూట‌ర్ సైన్స్‌లో అండ‌ర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందిన త‌ర్వాత స్టాన్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో డాక్ట‌రేట్ అందుకున్నారు. 2011 అక్టోబ‌ర్‌లో ట్విట్ట‌ర్‌లో ప‌రాగ్ అగ‌ర్వాల్ చేరారు. నాటి నుంచి సంస్థ‌లో ప‌లు కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. 

ట్విట్ట‌ర్ విశిష్ట  సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గానూ పనిచేశారు. ట్విట్ట‌ర్‌లో చేర‌క‌ముందు ఆయ‌న మైక్రోసాఫ్ట్ రీసెర్చ్‌, యాహూలో సేవ‌లందించారు. ట్విట్ట‌ర్ టెక్నిక‌ల్ స్ట్రాట‌ర్జీ, మెషిన్ లెర్నింగ్‌, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, క‌న్జూమ‌ర్ అండ్ సైన్స్ టైమ్‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు బాధ్య‌త వ‌హించారు.

2019 డిసెంబ‌ర్‌లో ప‌రాగ్ అగ‌ర్వాల్‌ను ప్రాజెక్ట్ బ్లూస్కై అనే ఇండిపెండెంట్ టీంకు ఇన్‌చార్జిగా ట్విట్ట‌ర్ సీఈవో జాక్ డోర్సీ ప్ర‌క‌టించారు. సోష‌ల్ మీడియా వేదిక‌పై దుర్భాష‌లాడే, త‌ప్పుదోవ ప‌ట్టించే స‌మాచారాన్ని నియంత్రించ‌డానికి డీ సెంట్ర‌లైజ్డ్ స్టాండ‌ర్డ్‌తో కూడిన టూల్స్ త‌యారు చేసే ఆర్కిటెక్‌లు, ఇంజినీర్లు, డిజైన‌ర్ల‌కు ఈ బ్లూ స్కై వ‌న‌రుగా ఉంటుంది.

ఈ మధ్యకాలంలో డోర్సే పెట్టుబడిదారుల నుండి వత్తిడికి గురవుతున్నారు. వారు కంపెనీని ‘సింగిల్ ఫోకస్’తో నడిపించాలని డిమాండ్ చేస్తున్నారు. బిజ్ స్టోన్, ఇవాన్ విలియమ్స్, నోహ్ గ్లాస్‌లతో కలిసి ఆయన కంపెనీని 2006లో స్థాపించారు. 2008లో డోర్సే తన డిజిటల్ చెల్లింపుల యాప్ స్క్వేర్‌ని సెటప్ చేయడానికి కంపెనీని విడిచిపెట్టాడు. అయితే 2015లో తిరిగి వచ్చాడు.

2023 చివరి నాటికి 315 మిలియన్ల మోనటైజేబుల్ డైలీ యాక్టివ్ యూజర్లను కలిగి ఉండడంతో పాటు, వార్షిక ఆదాయంను రెట్టింపు చేయడం వంటి భారీ లక్ష్యాలు ఇప్పుడు అగర్వాల్ ముందున్నాయి. 

 డోర్సీ రాజీనామా తక్షణ మే అమల్లోకి వస్తుందని సంస్థ తెలిపింది. అయితే 2022 వరకు కంపెనీ బోర్డులో డోర్సీ కొనసాగుతారని సోమవారం ట్విట్టర్ జారీ చేసిన ప్రకటనలో వెల్లడించిం ది. కంపెనీ ఫౌండర్స్ నుంచి బయటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తాను వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు డోర్సీ తన సందేశంతో తెలిపారు.