గడిచిన ఐదున్నరేండ్లకుపైగా కాలంలో దేశవ్యాప్తంగా 5 లక్షలకుపైగా కంపెనీలు మూతబడ్డాయి. 2016 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా దేశంలో మొత్తం 5,00,506 కంపెనీలు బందైనట్లు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వెల్లడి చేసింది. అయితే అదే సమయంలో 7.17 లక్షల మేరకు కొత్త కంపెనీలు వచ్చాయి.
పాత పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రాలవారీగా మూతబడ్డ సంస్థలు ఎన్ని? అంటూ సభ్యులు అడిగిన ప్రశ్నకు సోమవారం లోక్‌సభలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ ఓ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
రాష్ట్రాలవారీగా ఎన్ని మూతబడ్డాయన్న వివరాలు లేవన్న మంత్రి దాదాపు గడిచిన ఆరేండ్లలో అత్యధికంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో 2,36,262 సంస్థలు మూతబడినట్లు తెలిపారు. 2018-19లో 1,43,233, 2016-17లో 12,808, 2019-20లో 70,972, 2020-21లో 14,674 సంస్థలు మూతబడినట్లు వివరించారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా 22,557 సంస్థలు డీరిజిస్టర్ అయినట్లు వెల్లడించారు.
ఇదిలావుంటే గడిచిన ఐదున్నరేండ్లకుపైగా కాలంలో 2013 కంపెనీ చట్టం కింద దేశంలో కొత్తగా 7,17,049 సంస్థలు నమోదైనట్లు మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా 1,09,098 కొత్త సంస్థలు వచ్చినట్లు చెప్పారు.
More Stories
సవాళ్ల సుడిగుండంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి
రూ.2వేల కోట్ల భారీ ట్రేడింగ్ కుంభకోణంలో అస్సాం నటి అరెస్ట్
గౌతం అదానీ కంపెనీకి కెన్యాలో ఎదురుదెబ్బ