బిట్‌కాయిన్‌ను క‌రెన్సీగా గుర్తించ‌డంలేదు

దేశంలో బిట్‌కాయిన్‌ను క‌రెన్సీగా గుర్తించేందుకు ఎటువంటి ప్ర‌తిపాద‌న లేద‌ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ స్పష్టం చేసింది.  లోక్‌స‌భ‌లో లిఖిత‌పూర్వ‌క స‌మాధానం ఇచ్చిన మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. బిట్‌కాయిన్ లావాదేవీల‌కు చెందిన డేటాను ప్ర‌భుత్వం సేక‌రించ‌డంలేద‌ని పేర్కొన్నారు. 
 
లోక్‌స‌భ‌లో స‌భ్యులు సుమ‌ల‌తా అంబ‌రీష్‌, డీకే సురేశ్ త‌దిత‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె స‌మాధాన‌మిస్తూ బిట్ కాయిన్ ఒక డిజిట‌ల్ క‌రెన్సీ అని చెప్పారు. బ్యాంకులు, క్రెడిట్ కార్డులు, థ‌ర్డ్ పార్టీల భాగ‌స్వామ్యం లేకుండా వ‌స్తువులు, సేవ‌ల కొనుగోలుకు, న‌గ‌దు బ‌దిలీకి బిట్ కాయిన్ వాడుతున్నార‌ని తెలిపారు. 
 
అయితే  దేశంలో క్రిప్టో క‌రెన్సీ లావాదేవీల నియంత్ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం.. క్రిప్టో క‌రెన్సీ అండ్ రెగ్యులేష‌న్ ఆఫ్ అఫిషియ‌ల్ డిజిట‌ల్ క‌రెన్సీ బిల్లు-2021ను ప్ర‌స్తుత స‌మావేశాల్లోనే ప్ర‌భుత్వం పార్ల‌మెంట్‌కు స‌మ‌ర్పించ‌నుంద‌ని వార్త‌లొచ్చాయి. ఈ నేప‌థ్యంలో నిర్మ‌లా సీతారామ‌న్ వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. 
 
బిట్‌కాయిన్ లావాదేవీల నియంత్ర‌ణ కోసం రెగ్యులేట‌రీ వ్య‌వ‌స్థ అవ‌స‌రం అన్న అభిప్రాయాన్ని ఇటీవ‌ల కేంద్రం వ్య‌క్తం చేసింది. దేశంలో గ‌తేడాది ఏప్రిల్ నాటికి తొమ్మిది కోట్ల డాల‌ర్ల విలువ గ‌ల క్రిప్టో క‌రెన్సీ లావాదేవీల ట‌ర్నోవ‌ర్.. ప్ర‌స్తుతం 100 కోట్ల డాల‌ర్ల‌కు చేరుకున్న‌ది. 
 
ఆదాయం ప‌న్ను చ‌ట్టం-1961 కింద క్రిప్టో క‌రెన్సీల‌పై ప‌న్ను వ‌సూలు చేయ‌డానికి ఎటువంటి నిబంధ‌న‌ల్లేవు. దీనిపై త్వ‌ర‌లో ప్ర‌భుత్వం పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న క్రిప్టో క‌రెన్సీ నియంత్ర‌ణ బిల్లుతో స్పష్టత వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. బ్యాంక్ నోటు అన్న నిర్వ‌చ‌నాన్ని మారుస్తూ, దాంట్లో డిజిట‌ల్ క‌రెన్సీని కూడా జోడించే విధంగా ఆర్బీఐ చ‌ట్టాన్ని స‌వ‌రించాల‌ని ఇటీవ‌ల కేంద్రాన్ని ఆర్బీఐ కోరిన విష‌యం తెలిసిందే.
 
ప్ర‌స్తుతానికి ఆదాయం ప‌న్ను చ‌ట్టం కింద స్ప‌ష్ట‌మైన నిబంధ‌న‌లు లేకున్నా.. వ్యాపారం నుంచి లాభాలు, ప్ర‌యోజ‌నాలు గానీ, క్యాపిట‌ల్ అసెట్స్ విక్ర‌యంతో వ‌చ్చే క్యాపిట‌ల్ గెయిన్స్‌ను ఆదాయంగా నిర్వచించి ప‌న్ను విధించొచ్చు. క్రిప్టో క‌రెన్సీల్లో స్వ‌ల్ప‌కాలిక‌, దీర్ఘ కాలిక పెట్టుబ‌డుల ప్రాతిప‌దిక‌న క్యాపిట‌ల్ గెయిన్స్ టాక్స్ విధించ‌డానికి ఆస్కారం ఉంది. 
 
ఇప్పుడు 36 నెల‌లు దాటిన పెట్టుబడుల‌ను దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డులుగా ప‌రిగ‌ణిస్తారు. దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌పై 20 శాతం, మూడేండ్ల లోపైతే శ్లాబ్ రేట్ల ప్ర‌కారం ప‌న్ను విధించొచ్చు.