దిగుమతి సుంకాలు సడలింపు పట్ల కిసాన్ సంఘ్ ఆందోళన

రైతులు పండించిన పంటను మంచి ధరకు అమ్ముకునే అవకాశం ఉన్న తరుణంలో ప్రభుత్వం దిగుమతి సుంకాలనుసడలించడం పట్ల భారతీయ కిసాన్ సంఘ్ ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయ ఉత్పత్తులకు దీర్ఘకాలిక దిగుమతి-ఎగుమతి సుంకాల విధానం ఉండాలని డిమాండ్ చేసింది. దిగుమతి సుంకాల తగ్గింపును రద్దు చేయమని కోరుతూ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌కు వినతిపత్రం ఇచ్చిన్నట్లు తెలిపింది. 

“మొక్కజొన్నను ఏ రాష్ట్రంలోనూ కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి కొనుగోలు చేయడం లేదు. మార్కెట్ స్వయంగా ధరను అందించే సమయం వచ్చినప్పుడు, దిగుమతులను తగ్గించడం ద్వారా ధరలు నియంత్రించారు. పౌల్ట్రీ మేతగా సోయాబీన్ మీల్‌కు మొక్కజొన్న మంచి ప్రత్యామ్నాయం. కానీ సోయాబీన్ మీల్ దిగుమతిని సడలించడం ద్వారా, ప్రభుత్వం మొక్కజొన్న రైతులను బాధపెడుతోంది” అంటూ ఆ వినతిపత్రంలో తమ ఆవేదనను కేంద్ర ప్రభుత్వంకు స్పష్టం చేశారు. 

కిసాన్ సంఘ్ ప్రధాన కార్యదర్శి బద్రీ నారాయణ్ చౌదరి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రికి అందించిన ఈ వినతిపత్రంలో సోయాబీన్ మీల్ జన్యుపరంగా మార్పు చెందిన పంటల నుండి తీసుకున్నారని పేర్కొంటూ, ఇది “అంతర్జాతీయ మార్కెట్‌లో భారతదేశంకు గల జీఎంయేతర ట్యాగ్‌ను బెదిరిస్తుంది” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 

అదే విధంగా, పత్తి ఉత్పత్తులు మార్కెట్‌లకు చేరుకునే సమయం వచ్చినప్పుడు, దిగుమతి చేసుకున్న పత్తి రాక మార్కెట్‌ను మందగిస్తుందని పేర్కొన్నారు. ఇటీవలే కేంద్ర మంత్రిని జౌళి పరిశ్రమ సమాఖ్య ప్రతినిధి బృందం కలవడంతో పత్తి ధర టన్నుకు రూ.1,000 తగ్గిందని, దానితో చాలా మంది రైతులు ఎంఎస్‌పి కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వస్తుందని తెలిపింది. 

కానీ మార్కెట్‌లో ఎమ్‌ఎస్‌పి కంటే కొంచెం ఎక్కువ సంపాదించగల పరిస్థితి ఉన్నప్పుడు, దిగుమతులను సడలించడం ద్వారా ధరలు తగ్గుతాయిని కిసాన్ సంఘ్ హెచ్చరించింది. 

ఇలా ఉండగా, గతవారం పీయూష్ గోయల్ వస్త్ర పరిశ్రమ సంస్థలతో సమావేశమై ధరల తారుమారు లేదా హోర్డింగ్‌ను ఆశ్రయించవద్దని పత్తి బేల్ వ్యాపారులను హెచ్చరించారు. పత్తి ధరల సమస్యను పోటీతో కాకుండా సహకార స్ఫూర్తితో పరిష్కరించుకోవాలని ఆయన వారికి సూచించారు. 

“పత్తి ధరలు ఎమ్‌ఎస్‌పి స్థాయి రూ 6,025 కంటే దాదాపు 40 శాతం అంటే క్వింటాల్‌కు రూ. 8,500, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)  ఉన్నాయి. రైతులు తమ ఉత్పత్తులకు సహేతుకమైన మంచి ధరలను పొందుతున్నారు, ఇది ఇతర వ్యవసాయ వస్తువులతో సమానంగా ఉంది” అని ఈ సమావేశం తరువాత విడుదల చేసిన ప్రభుత్వ ప్రకటన తెలిపింది.

కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన హామీ కోసం డిమాండ్ చేయడంతో, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా వలె కిసాన్ సంఘ్ కూడా కోరుతున్నది.