త్రిపురలో మొత్తం 14 మునిసిపాలిటీలు గెల్చుకున్న బీజేపీ

నవంబర్ 15న ఎన్నికలు జరిగిన త్రిపురలో మొత్తం 14 మునిసిపాలిటీలు కైవసం చేసుకుని, త్రిపుర పురపాలక ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం సాధించింది. అగర్తల మున్సిపల్ కార్పొరేషన్‌తో సహా 11 మునిసిపాలిటీలలో క్లీన్ స్వీప్ చేసింది.

మొత్తం 14 పట్టణాల్లోని 222 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, బీజేపీ 217 స్థానాల్లో విజయం సాధించింది. గత పర్యాయం జరిగిన  ఎన్నికలలో అన్ని మునిసిపాలిటీలలో గెలుపొందిన సిపిఎం ఇప్పుడు కేవలం మూడు పట్టణ సంస్థలలో మూడు స్థానాల్లో విజయం సాధించింది. 

కైలాషహర్, అంబస్సా మున్సిపల్ కౌన్సిల్స్, పానీసాగర్ నగర్ పంచాయితీ. అగర్తల మున్సిపల్ కార్పొరేషన్ లలో బీజేపీ తర్వాత అత్యధిక ఓట్లను సాధించిన తృణమూల్ కాంగ్రెస్, అంబాసా నగర్ పంచాయతీలో ఒక్క సీటును గెలుచుకోగా, త్రిపుర రాజ వంశస్థుడు ప్రద్యోత్ కిషోర్ నేతృత్వంలోని టిప్రా మోతా ఒక స్థానాన్ని గెలుచుకుంది.

రాష్ట్రంలోని 20 పట్టణ స్థానిక సంస్థల్లో 14 స్థానాలకు నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలోని మొత్తం 324 మునిసిపల్ స్థానాల్లో 112 స్థానాల్లో బీజేపీ పోటీ లేకుండా విజయం సాధించింది. మిగిలిన 222 స్థానాల్లో అత్యధికంగా 81.54 శాతం ఓటింగ్ నమోదైంది.

ఈ విజయాలు ప్రారంభం మాత్రమే అని బిజెపి ఐటి విభాగం కన్వీనర్ అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు. “హింస, బెదిరింపు రాజకీయాలు చాలా తక్కువ కాలం మాత్రమే కొనసాగగలవు. బెంగాల్ వెలుపల మాత్రమే కాదు, బెంగాల్‌లో కూడా మమతా బెనర్జీకి మరింత రాజకీయ అవమానం ఎదురుచూస్తోంది. త్రిపుర కేవలం ప్రారంభం మాత్రమే” అని ఆయన పేర్కొన్నారు. 

“త్రిపుర స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి విజయం సాధించింది. మొత్తం ప్రతిపక్షాలు, కొత్త ప్రాయోజిత మీడియా కోసం ఆలోచించండి, చివరకు బిజెపి రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత త్రిపుర ఉనికిని గుర్తించింది. అన్ని కుట్రలు, మత ఉద్రిక్తతలకు సంబంధించిన బూటకపు కథనాలు మట్టిలో కలిసిపోయాయి” అంటూ ఎద్దేవా చేశారు. 

కౌంటింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ కోసం సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్, త్రిపుర పోలీసులు, త్రిపుర స్టేట్ రైఫిల్స్ (టీఎస్‌ఆర్) సిబ్బందితో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. తాజా నివేదికలు వచ్చే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.

గురువారం నాటి పోలింగ్‌లోనే టిఎంసి, సిపిఎంలు వివిధ మునిసిపాలిటీల్లో రీపోలింగ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఓట్ల అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అయితే అధికార బీజేపీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. త్రిపురలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలపై కోర్టు పర్యవేక్షణ ప్యానెల్‌తో విచారణ జరిపించాలని కోరుతూ టిఎంసి శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

పోలింగ్ రోజున, రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటింగ్ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఉండేలా చూసేందుకు “వీలైనంత త్వరగా” ఏదైనా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ కు చెందిన అదనంగా రెండు కంపెనీలను అందించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది.