కరోనా మహమ్మారి ఇంకా అంతం కాలేదు

కరోనా మహమ్మారి ఇంకా అంతం కాలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ వారించారు.  83వ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. 

ఈ వైరస్ రూపాంతరం ఒమిక్రాన్‌ను గుర్తించడంతో ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి ఇంకా ఉందని మర్చిపోవద్దని ప్రధాని హెచ్చరించారు. దక్షిణాఫ్రికాలోని బోట్స్‌వానాలో ఒమిక్రాన్‌ను గుర్తించారు. ఇది వేగంగా వ్యాపించగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. 

ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా  మహమ్మారి, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై చర్చించారు. ఒమిక్రాన్ వ్యాపించే అవకాశాల గురించి కూడా సమీక్షించారు. 

మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, పాకిస్థాన్‌పై యుద్ధంలో భారత దేశం 1971 డిసెంబరు 16న విజయం సాధించిందని గుర్తు చేశారు. ఈ విజయానికి సంబంధించిన 50వ వార్షికోత్సవాలు డిసెంబరు 16న జరుపుకుంటామని తెలిపారు. డిసెంబరులో దేశం నావికాదళ దినోత్సవాలు, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే జరుపుకుంటుందని చెప్పారు. 

ఈ సందర్భంగా తాను మన దేశ సాయుధ దళాలను, సైనికులను స్మరించుకుంటున్నానని తెలిపారు. మరీ ముఖ్యంగా ఈ హీరోలకు జన్మనిచ్చిన ధైర్యవంతులైన తల్లులను గుర్తు చేసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ, ఇద్దరు లబ్ధిదారులతో మోదీ మాట్లాడారు. వీరిద్దరూ కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం క్రింద లబ్ధి పొందారు. వీరు ప్రాణ రక్షక చికిత్సను పొందారు. 

డిసెంబరు 6న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు మోదీ నివాళులర్పించారు. బాబా సాహెబ్ తన యావత్తు జీవితాన్ని దేశం, సమాజం పట్ల తన కర్తవ్య నిర్వహణకు అంకితం చేశారన్నారు. మనమంతా మన కర్తవ్యాలను నిర్వహించాలని రాజ్యాంగ మౌలిక స్ఫూర్తి చెప్తోందని తెలిపారు. 

ప్రస్తుతం ప్రపంచంలో స్టార్టప్‌ల యుగం నడుస్తోందని చెబుతూ ఈ రంగంలో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహిస్తోందని ప్రధాని చెప్పారు. దేశంలో గల 70కి పైగా స్టార్టప్‌ల విలువ 1 బిలియన్ డాలర్లను దాటాయి అని తెలిపారు.

 “ఈ రోజుల్లో మన చుట్టూ స్టార్టప్‌, స్టార్టప్‌, స్టార్టప్‌ వింటాము. ఇది స్టార్టప్‌ల శకం, ఈ స్టార్టప్‌ల రంగంలో ఒక విధంగా భారతదేశం ప్రపంచాన్ని నడిపిస్తోంది అనేది కూడా నిజం” అని మోదీ పేర్కొన్నారు. “దేశంలోని చిన్న నగరాల్లో కూడా స్టార్టప్‌ల వ్యాప్తి పెరిగింది. ఈ రోజుల్లో యునికార్న్ అనే పదం చాలా చర్చలో ఉంది. యునికార్న్ స్టార్టప్‌ల విలువ ఒక బిలియన్ డాలర్లు (సుమారు రూ.7,000 కోట్లు)” అని ప్రధాని వివరించారు.