అవయవ దానంలో మూడో స్థానంలో భారత్

గ్లోబల్ అబ్జర్వేటరీ ఆన్ డొనేషన్ అండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రకారం, అవయవదానంలో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉందంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సంతోషం వ్యక్తం చేశారు. 12వ భారతీయ అవయవదాన దినోత్సవాన్ని ఉద్దేశించి ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ… ” “జీతే జీ రక్తదాన్, మర్నే కే బాద్ అంగదాన్(ప్రత్యక్ష రక్తదానం, మరణానంతరం అవయవ దానం)” అనేది మన జీవితానికి నినాదంగా ఉండాలని సూచించారు. 
 
అంతేకాదు మన సంస్కృతి “శుభ్”, “లాభ్” లకు మాత్రమే ప్రాధాన్యతనిస్తుందని గుర్తు చేశారు. పైగా ఇక్కడ వ్యక్తిగత శ్రేయస్సు అనేది సమాజ శ్రేయస్సుతో మిళతమవుతోందని చెప్పారు. 2010 నుంచి చనిపోయిన దాతలు, వారి కుటుంబాలు సమాజానికి చేసిన సేవలను స్మరించుకోవాడానికే ప్రతి ఏడాది భారతీయ అవయవదాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. 
 
2012-13తో పోలిస్తే అవయవదానం దేశంలో రేటు నాలుగు రెట్లు పెరిగిందని మంత్రి చెప్పారు. దేశంలో సంవత్సరానికి జరిగే అవయవ మార్పిడిల సంఖ్య 2013లో 4990 ఉండగా 2019కి వచ్చేటప్పటికీ ఆ సంఖ్య 12746కి పెరిగింది. భారత్‌ ఇప్పుడు అమెరికా,  చైనా తర్వాత స్థానాన్ని ఆక్రమించుకుని ప్రపంచంలో మూడవ స్థానంలో ఉందని వివరించారు. 
 
అయితే మన అవసరాల మేరకు అవయవ దానం జరగడం లేదని పేర్కొంటూ, రాబోయే రోజులలో ఈ అవసరం మరింత ఎక్కువగా ఉండగలదని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా అవయవ దానం, అవయవ మార్పిడి కార్యక్రమాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని విచారం వ్యక్తం చేశారు. 
 
ఈ క్రమంలో ప్రజలు తమ అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయడమే కాకుండా, దేశంలో మార్పిడికి అందుబాటులో ఉన్న అవయవాల కొరతపై ప్రచారం చేసి, ఇతరులు కూడా అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చేలా చేయాలని ఆరోగ్య మంత్రి మాండవియా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.